శ్రీమందిర్‌ కొత్త సేవా విభాగం అడ్మినిస్ట్రేటర్‌గా ప్రియ రంజన్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీమందిర్‌ కొత్త సేవా విభాగం అడ్మినిస్ట్రేటర్‌గా ప్రియ రంజన్‌

Mar 3 2026 9:15 AM | Updated on Mar 3 2026 9:15 AM

ఆక్రమణలు గుర్తింపు

భువనేశ్వర్‌: పూరీ శ్రీ మందిరం సేవా విభాగం ప్రముఖునిగా ప్రియ రంజన్‌ పృష్టి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ మందిరం సందర్శించి రత్న వేదికపై కొలువు దీరిన మూల విరాట్లను దర్శించుకున్నారు. శ్రీ మందిరంలో సేవాదులు సక్రమంగా సకాలంలో నిర్వహించేందుకు సాధ్యమైనంత వరకు అంకిత భావంతో కృషి చేస్తానన్నారు. సేవల విభాగంలో అన్ని వర్గాల సమన్వయం, సహకారంతో మాత్రమే ఇది సాధ్యమని పేర్కొన్నారు. శ్రీ మందిరం ఇతర విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతించారు.

ముగిసిన నామ సంకీర్తన

రాయగడ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి చైతన్య రాంజీ ఆధ్వర్యంలో జిల్లాలోని కొలనార సమితి దొందులి గ్రామ పంచాయతీ పాత్రపుట్‌ గ్రామంలో గత నెల 28 నుంచి నిర్వహిస్తున్న అష్ట్రపహారి నామ సంకీర్తన కార్యక్రమం సోమవారంతో ముగిసింది. మూడు రోజుల పాటుగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని హరేరామ నామ కీర్తనలను చేశారు. ఆధ్యాత్మికంగా అందరిలో భక్తి, భావాలు పెంపొందాలని స్వామి చైతన్య రాంజీ ప్రసంగించారు. ఉన్న సమయంలో కొంత కేటాయించి దేవుని కీర్తనల కోసం గడపాలని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

పొందూరు: త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న సైన్స్‌ సమగ్ర మహోత్సవ్‌–2026 పోటీలకు జిల్లా నుంచి పొందూరు కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాత్రుని ఐశ్వర్య రూపొందించిన ‘ఫార్మర్స్‌ ఫ్రెండ్లీ లైఫ్‌ సేవర్స్‌ స్టిక్‌’ ప్రాజెక్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్‌ ఎస్‌.లలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థినిని అధ్యాపక సిబ్బంది అభినందించారు.

కౌలు రైతులను పట్టించుకోవడం లేదు

సరుబుజ్జిలి: కౌలు రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించడం ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. జిల్లాలో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నా.. వారికోసం పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదనవ వ్యక్తం చేశారు. కౌలు కార్డులకు రుణాలు, అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ మండల శాఖ కార్యదర్శి అదపాక రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్‌పీ నంబర్‌ 324, 325లో వేసిన లే–అవుట్‌లో ఆక్రమణలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. రియల్‌ దందా అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మండల సర్వేయర్‌ సుభాష్‌ ఆధ్వర్యంలో లే అవుట్‌ను పరిశీలించి సర్వే చేశారు. గ్రామ కంఠంకు సంబంధించి 7 సెంట్లు, వంశధార కాలువకు సంబంధించి 2 సెంట్లు కలిపి మొత్తం 9 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని మార్కింగ్‌ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాడ ఉమాపతి, విలేజ్‌ సర్వేయర్‌ త్రిమూర్తులు ఉన్నారు. కాగా ఎల్‌పీ నంబర్‌ 324, 325లో భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని, దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదని పీజీఆర్‌ఎస్‌లో కె.కుసుమారెడ్డి ఫిర్యాదు చేశారు.

లే అవుట్‌ను పరిశీలిస్తున్న సర్వేయర్‌ సుభాష్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement