మహిళ అనుమానాస్పద మృతి
● బ్యాంకు పనిపై వెళ్లి శవమైన వైనం
రాయగడ: పాఠశాల మైదానంలో డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి నారాయణపూర్ పంచాయతీ పరిధిలోని పడేయికాని గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మైదానంలో మహిళ మృతదేహం ఉండటాన్ని బుధవారం ఉదయం కొంతమంది గుర్తించారు. దీంతో స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు మునిగుడ సమితి అంబాధాని గ్రామానికి చెందిన ఫులమ సికక (50)గా గుర్తించారు. అయితే హత్యా లేక ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పొలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త తెలి సికక ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య సోమవారం బ్యాంకు పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మైదానంలో మహిళ మృతదేహం పడిఉందని తెలియడంతో వెళ్లి చూడగా తన భార్యగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.


