రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
పర్లాకిమిడి: వ్యవసాయం, రైతులు కష్టాలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ గజపతి జిల్లా ప్రభారి రంజిత్ పట్నాయక్ అన్నారు. రైతుల సమస్యలపై గుసాని సమితి ఏడో మైలు జంక్షన్ వద్ద బుధవారం నిర్వహించిన సమావేశానికి నవ నిర్మాణ్ కృషక్ రాష్ట్ర కోఆర్డినేటర్ అక్షయ కుమార్, గజపతి జిల్లా రైతు సంఘం నాయకులు సూర్యనారాయణ పట్నాయక్, రాష్ట్ర యువ విద్యార్థి సంఘం కో ఆర్డినేటర్ ఎం.డి.నట్వర్ అలీ, గుసాని జిల్లా పరిషత్తు సభ్యులు ఎస్.బాలరాజు, మాణిక్ పాయక్, పూర్ణ గోమాంగో, కృష్ణ నాయక్ తదితరులు హాజరయ్యారు. రైతులకు సరఫరా చేసే యూరియా బస్తా రూ.166 ఒకప్పుడు ఉండగా, అది మూడు రెట్లు రూ.800 నుంచి రూ.1000లకు ఈ ప్రభుత్వం పెంచిందన్నారు. రైతులకు మద్దతు ధర (ఎం.ఎస్.పి ) పెంచడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం సిఫారసులకు ముందుకు వచ్చిందని రంజిత్ పట్నాయక్ అన్నారు. ధాన్యం విక్రయ కేంద్రాలలో (మండీ) ధాన్యం ప్రోక్యూర్‌మెంట్ అధికారులు క్వింటాకు ఐదు కేజీలు కట్ చేస్తున్నారని, సంచుల డబ్బులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు నెలసరి పింఛన్ డిమాండ్ నెరవేరలేదని, అందువల్ల సమీప భవిష్యత్తులో మరోసారి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ నాయకులు రంజిత్ పట్నాయక్ తెలిపారు.
బహుమతుల ప్రదానం
రాయగడ: స్థానిక అటానమస్ కళాశాలలో గత మూడు రోజులుగా కొనసాగిన క్రీడోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు జిల్లా కలక్టర్ నవీన్ చంద్ర నాయక్ హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతి రాయ్ కళాశాలలో నిర్వహించిన పోటీల వివరాలను చదివి వినిపించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారికి నవీన్‌నాయక్ అభినందించారు.
రైతును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం


