త్వరలో రత్న భాండాగారం వస్తువుల లెక్కింపు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం (ఖజానా)లోని విలువైన వస్తువుల లెక్కింపు కొత్త సంవత్సరం జనవరి నెలలో ప్రారంభం అవుతుందని అధికారులు బుధవారం తెలిపారు. రత్న భాండాగారం వెలుపల, లోపల మిద్దెల మరమ్మతు భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 27న సాయంత్రం 4.30 గంటలకు శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలితో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రత్న భాండాగారంలో అమూల్య ఆభరణాలు పర్యవేక్షించే 16 మంది సభ్యుల కమిటీ ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీ) ఖరారు చేస్తుందని ఛైర్మన్ ఒరిస్సా ఉన్నత న్యాయ స్థానం విరామ న్యాయమూర్తి బిశ్వనాథ్ రథ్ తెలిపారు. బలభద్ర స్వామి, దేవీ సుభద్ర మరియు శ్రీ జగన్నాథ స్వామి ఆభరణాలు, ఇతర సంపద లెక్కించడానికి తేదీలను ఖరారు చేయడం జరుగుతుందన్నారు. ఏఎస్‌ఐ మరమ్మతు పనులు సందర్భంగా దేవతల విలువైన ఆభరణాలు, వస్తువులను తాత్కాలికంగా ఆలయం లోపల స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఇప్పుడు మరమ్మతులు పూర్తయ్యాయి. రత్న సంపదని యథాతథంగా వాస్తవ స్థానాల్లో పునరుద్ధరించనున్నారు. కచ్చితత్వం, సరైన నిర్వహణను నిర్ధారించడానికి లెక్కింపు 2 రోజులు నిరవధికంగా జరుగుతుందని భావిస్తున్నారు. కమిటీ తుది తేదీలను పాలక మండలికి సమర్పిస్తుంది. ఆ తర్వాత వారు ఒడిశా ప్రభుత్వానికి ఆమోదం కోసం తీర్మానాలను పంపుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలన్ని కమిటి అనుసరిస్తుందన్నారు. జాబితా సమయంలో భక్తుల దర్శనంపై ప్రభావం పడవచ్చని తెలిపారు.


