అవిభక్త కొరాపుట్ ప్రగతికి సహకరించండి
జయపురం: అవిభక్త కొరాపుట్తోపాటు దక్షిణ ఒడిశా సర్వాంగ ఉన్నతికి కొన్ని అభివృద్ది పనులు చేపట్లాలని, అందుకు సహకరించాలని జయపురం చాంబర్ ఆఫ్ కామర్ష్ అండ్ ఇండస్ట్రీస్ నవరంగపూర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత బలభద్ర మఝికి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. బుధవారం స్థానిక నెహ్రూనగర్ వేదికలోని చాంబర్ సభాగృహంలో జరిగిన చాంబర్ డైరెక్టర్ల సమావేశానికి నవరంగపూర్ ఎంపీ బలభద్ర మఝిని ఆహ్వానించింది. ఈ సందర్భంగా జయపురం చాంబర్ అధ్యక్షులు బి.ప్రభాకర్ కొన్ని సూచనలతో వినతి పత్రం ఎంపీకి సమర్పించారు. అవిభక్త కొరాపుట్ ప్రాంతంలో విలువైన ప్రకృతి, మానవ వనరులతో పాటు ఇంకా గుర్తించని ప్రకృతి సంపద ఉన్నాయని వెల్లడించారు. 1967లో ఏర్పడిన జయపురం చాంబర్ ఆఫ్ కామర్ష్ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలను కల్పిస్తున్నదని గుర్తు చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న క్రూసికల్ డవలప్‌మెంట్ పనులకు సూచనలు సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాంత ముఖ్యంగా దక్షిణ ఒడిశా ఉన్నతికి రైల్వే ప్లానింగ్, పాలసీ మేకింగ్ పనులు అవసరమని చెప్పారు. జయపురం–నవరంగపూర్–మల్కనగిరి రైల్వే ప్రకటించి పదేళ్లకుపైనే అయిందని, ఈ రైల్వే ప్రాజెక్టు వలన వెనుకబడిన ఆదివాసీ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక ప్రగతి, వ్యాపార ఉన్నతి జరుగుతుందన్న లక్ష్యం గల ఆ రైలు మార్గం నేటికీ కార్యరూపం దాల్చ లేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్నారు. వీటిపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధికి చర్యలు చేపడితే తాము పూర్తి సహకారం అందిస్తామని చాంబర్ అధ్యక్షులు ప్రభాకర్ వినతిలో వివరించారు. ఎంపీ బలభద్ర మఝి మాట్లాడుతూ.. జయపురం చాంబర్ సూచనలు కార్యరూపం దాల్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో చాంబర్ కార్యదర్శి డి.మాధవ, శశిభూషణ పట్నాయక్ తదితరులు ఉన్నారు.


