రేపటి నుంచి కేంద్రీయ విద్యాలయంలో దరఖాస్తుల విక్రయం
● 30 వరకూ దరఖాస్తుల స్వీకరణ
జయపురం: జయపురం కేంద్రీయ విద్యాలయం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇందులో చేరేందుకు ఆసక్తి ఉన్న వారి కోసం జూన్ నెల రెండో తేదీ సోమవారం నుంచి దరఖాస్తులను విక్రయించనున్నారు. ఈ విషయాన్ని విద్యాలయం కొరాపుట్ ప్రిన్సిపాల్ ఎస్.కె.దాస్ శనివారం వెల్లడించారు. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. అయితే జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్‌తో చర్చించిన తరువాత ఎన్ని రోజులు దరఖాస్తు ఫారాలను విక్రయించాలో నిర్ణయిస్తామన్నారు. ఇదిలా ఉండగా జయపురం కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్‌గా నయాగుడ కేంద్ర విద్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయుడుని నియమించినట్లు తెలిసింది. జయపురంలో కేవీకే ఏర్పాటు చేయాలని అనేక సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. జయపురం ఎమ్లల్యే తారాప్రసాద్ బాహిణీ పతి , కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర ఉల్కలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడంతో ఎట్టకేలకు విద్యాలయం మంజూరైంది.


