అంగరంగ వైభవంగా పోలమాంబ చండీహోమం
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజన ఆరాధ్య దేవత శంబర పోలమాంబ అమ్మవారి 10వ జాతర మహోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా మంగళవారం చండీహోమం కార్యక్రమం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలమాంబ అమ్మవారి చదురుగుడి, వనంగుడి ఆలయాల్లో కొలువైన పోలమాంబ అమ్మవార్లకు ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేశారు. చదురుగుడి వద్ద 11 హోమగుండాలను ఏర్పాటుచేసి, వేద పండితులు అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ, డీఎల్ ప్రసాదరావు, బాలబాబు శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు . పూర్ణాహుతి కార్యక్రమంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్.రాజారావు, సీనియర్ సహాయకులు శ్రీనివాసరాజు, సర్పంచ్ వెదుళ్ల సింహాచలమమ్మ, ఎంపీటీసీ టి.పోలి నాయుడు, ఉపసర్పంచ్ అల్లు వెంకటరమణ, ఉత్సవ కమిటీ సభ్యులు నైదాన తిరుపతిరావు, మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌లు పూడి దాలినాయుడు, వసంతల భాస్కరరావు, గంజి కాశినాయుడు, మావుడి మాజీ సర్పంచ్ అక్యాన తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


