శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి ఆదిత్యానగర్ కాలనీలోని మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ (ఎంసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 30న విశ్వావసు నామ ఉగాది పురస్కారాలను వివిధ రంగాలలో ప్రముఖులకు అందజేస్తున్నట్లు నిర్వాహకులు భాగ్యలక్ష్మి, నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలరంజని సంస్థ ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాలలో ప్రతిభ సాధించిన బాలలకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.వాండ్రంగి కొండలరావు (సాహిత్యరత్న), బద్రి కూర్మారావు (సేవా రత్న), కంటు మురళీగోవింద్ (నాట్యరత్న), ఎర్రపాటి అప్పారావు (నటరత్న), నేరెళ్ల సత్యనారాయణ (గానరత్న), ఆచింటు లక్ష్మణరావు (వాయిద్యరత్న), వడగ సుబ్రహ్మణ్యం (హరికథారత్న), ఇంజరాపు మోహన్‌రావు (వైద్యరత్న), యాపార శ్రీనివాస్ (యువ సేవారత్న), ఎలినాటి ధరణి (బాలరత్న–కోలాటం), బి.సన్నిహిత్ (బాలరత్న–చిత్రలేఖనం), ఎం.లిప్సి శ్రీవల్లి జయదేవ్‌కుమార్ (కూచిపూడి, సంగీతం), శ్రీకాకుళం చిట్టి (బాలరత్న– ఇన్‌స్ట్రాగామ్), బిన్నాడ దీక్షిత్ (శ్లోకపఠనం)లకు పురస్కారాలు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, నగరంలోని సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షుడు ఉమాకవికి నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు విశిష్ట ధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారానికి ఎంపికై నట్లు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ ఒక ప్రకనటలో తెలిపారు.
బార్ అసోసియేషన్
ఎన్నికలు రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న ఉదయం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కార్యదర్శి, కోశాధికారి, క్రీడా, లైబ్రరీ కార్యదర్శుల పోస్టులకు ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవమయ్యాయి. కార్యదర్శిగా మోటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, లైబ్రరీ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నిక జరగనుంది.
ఉప సర్పంచ్‌పై చర్యలకు వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచి మరో పార్టీలో చేరి ఇప్పుడు మేజర్ పంచాయతీ పరిపాలనకు ఆటంకంగా మారిన నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి సాయి ప్రత్యూషకు ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్‌పై పాలకవర్గంలోని 16 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ కోరాడ చంద్రభూషణ గుప్తా, మెంబర్లు వార్డు రఘుపాత్రుని శ్రీధర్, బంకుపల్లి శర్మ, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, ఎంపీటీసీ బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, మాజీ డైరెక్టర్ బబ్బోది ఈశ్వరరావు, సతివాడ రామినాయుడు, తోట భార్గవ్ తదితరులు ఉన్నారు.
14 కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు
కాశీబుగ్గ: ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి నుంచి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ షరీఫ్ తెలిపారు. తమిళనాడుకు చెందిన త్యాగు, విఘ్నేష్, అజిత్‌లు మంగళవారం పర్లాఖిమిడి నుంచి గంజాయి తెప్పించుకుని పలాసలో తమిళనాడు వెళ్లే రైలు కోసం వేచి ఉండగా సీసీ కెమెరాల్లో వారి కదలికలపై అనుమానం వచ్చిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు వారిని తణిఖీ చేశారు. వారి వద్ద రూ.74 వేలు విలువైన 14.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి కేసులో మరో ముగ్గురు అరెస్టు
ఆమదాలవలస: పట్టణంలోని కండ్రపేట వీధి వెనుక శ్మశానవాటిక గత ఏడాది అక్టోబర్ 27న ఐదు కిలోల గంజాయిని అప్పటి ఎస్‌ఐ కె.వెంకటేష్ నేతృత్వంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఏడుగురిలో నలుగురు పట్టుబడగా ముగ్గురు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీకాకుళం నానుబాలవీధికి చెందిన తమ్మినేని సాయి, శ్రీకాకుళం దమ్మలవీధికి చెందిన మైపల్లి రాంబాబు, ఆమదాలవలస వాంబే కాలనీకి చెందిన పాలకొండ చిన్న నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు ఆమదాలవలస ఎస్‌ఐ ఎస్.బాలరాజు తెలిపారు. నిందితులను ఆమదాలవలస సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.