ఘనంగా ద్విగళ అష్టావధానం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ద్విగళ అష్టావధానం

Mar 24 2025 11:24 AM | Updated on Mar 24 2025 11:22 AM

పాలకొండ: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం శ్రీ సూర్యచంద్ర కళాసాహితి ఆధ్వర్యంలో ద్విగళ అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్‌ పాల్గొని అవధాని బంకుపల్లి రమేష్‌ శర్మ, అవధాన చంద్రమస శతావధాని చంద్రశేఖర శర్మ, అవధాన చంద్రమస శతావధాని సాయికుమార్‌ శర్మలను సన్మానించారు. విశ్వావసు నామసంవత్సర ఉగాధి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కణపాక చౌదరినాయుడు, సింహచలాచార్య, బౌరోతు శంకరరావు, దిలీప్‌కుమార్‌, సాహితి శ్రీనివాసరావు, వెలమల మన్మథరావు, కడగల రమణ, గారాల సూర్యం తదితరులు పాల్గొన్నారు.

ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో రజతం

విజయనగరం: ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సిల్వర్‌ మెడల్‌ కై వసం చేసుకుని జిల్లా పేరు మరోసారి మారు మోగించిందని పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌ తెలిపారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పారా క్రీడాకారులు పాల్గొన్నారని, టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందెంలో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ లలిత అసామాన్య ప్రతిభ కనబరిచి సిల్వర్‌ మెడల్‌ సాధించడం అభినందనీయమని, ఇది జాతీయస్థాయిలో జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. లలిత ను పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రా ష్ట్రకార్యదర్శి వి. రామస్వామి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) చైర్మన్‌ అనిమిని రవినాయుడు, కలెక్టర్‌ డాక్టర్‌. బీఆర్‌. అంబేడ్కర్‌, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందించారని తెలియజేశారు.

సీనియార్టీ జాబితా తయారీకి ఏకీకృత విధానం తప్పనిసరి

పార్వతీపురంటౌన్‌: వివిధ జిల్లాలకు చెందిన విద్యాశాఖాధికారులు సీనియార్టీని రూపొందించడంతో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఏపీటీఎఫ్‌ పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఎన్‌. బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు, రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్‌ల ప్రకారం రూపొందించారని, బదిలీలకు రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బదిలీల్లో వ్యక్తిగతంగా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ, పనిచేసే పాఠశాల హెచ్‌ఆర్‌ఏ, పూర్తి సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తారన్నారు. బదిలీల పాయింట్లు సమానంగా వస్తే వయస్సును బట్టి సీనియార్టీ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు సీనియార్టీ రూపొందించడంలో ఒకే నిర్దిష్ట నియమాలు అనుసరించకపోవడం వల్ల పొరపాట్లు జరుగుతున్నాయని, వాటిని సవరించే విధంగా స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

సంగీత, సాహిత్యాలతో

పైడితల్లికి ఘనంగా నీరాజనం

విజయనగరం టౌన్‌: శ్రీ పైడిమాంబ కళానికేతన్‌ ఆధ్యాత్మిక సేవా సంఘం 27వ వార్షికోత్సవాన్ని ఏప్రిల్‌ 22న గురజాడ కళాభారతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సంస్థ వ్యవస్ధాపకుడు ఆర్‌.సూర్యపాత్రో పేర్కొన్నా రు. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత, సాహి త్య కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారికి ఘనంగా నీరాజనాలర్పిస్తూ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలి పారు. అదే రోజు అమ్మవారి భక్తిగీతాలపపై భజన సీడీలను ఆవిష్కరిస్తామన్నారు. సంస్థ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త నాలుగెస్సుల రాజు మాట్లాడుతూ పైడిమాంబ కళానికేతన్‌ సంస్ధ 27వ వార్షికోత్సవానికి ప్రముఖులతో పాటు, పలువురు పెద్దలు హాజరుకానున్నారన్నారు. ఆ రోజు వేకువజామునుంచి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించే సభా కార్యక్రమంలో పలువురిని సముచితరీతిలో సత్కరిస్తామన్నారు.

ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు

భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది.

శ్రీపైడిమాంబ కళానికేతన్‌ ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్ధాపకుడు పాత్రో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement