కొనసాగుతున్న మిల్లర్ల ఆందోళన
భువనేశ్వర్: రాష్ట్రంలో రైస్ మిల్లర్ల నిరసన కొనసాగుతోంది. దీంతో అన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా రైతులు ఇబ్బందుల్లో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్ల సంఘం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఈ పరిస్థితి తాండవిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మండీల నుంచి వరి కొనుగోలు పూర్తిగా ఆగిపోయింది. రైతులు చలి రాత్రుల్లో మార్కెట్ యార్డుల్లో అమ్ముడుపోకుండా పడి ఉన్న ధాన్యం బస్తాలకు కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మండీల్లో వరి కొనుగోలు నిలిపివేసిన మిల్లర్లు రాష్ట్ర రాజధాని నగరంలో వీధుల్లోకి వచ్చి తమ దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చాలని ఒత్తిడి చేస్తూ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తూ లిఖిత పూర్వక హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు దాదాపు రూ.350 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందని మిల్లర్ల సంఘం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న మొత్తం వరి మరియు బియ్యం నిల్వ, నిర్వహణ, పర్యవేక్షణ మరియు రవాణా ఖర్చుల ఖాతా కింద ఈ బకాయి పేరుకుపోయింది.
మిల్లింగ్ చార్జీలు పెంచాలి
బకాయిలు చెల్లించకున్నా నిర్వహణ ఖర్చులు యథాతథంగా పెరుగుతున్నాయని మిల్లర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. మిల్లింగ్ చార్జీలను పెంచాలని సంఘం డిమాండ్ చేసింది. సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి 14 నెలల సమయం కేటాయించినా ప్రయోజనం శూన్యం కావడంతో వీధికి ఎక్కడం అనివార్యమైందని ఆరోపించారు. భారీ బకాయిల చెల్లింపుపై ఇచ్చిన పదే పదే హామీలు నీటిమీద రాతలుగా మిగిలిపోయాయని కలవరపడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల అదనంగా ఒక నెల సమయం కోరినప్పటికీ మిల్లర్ల సంఘం ఇక వేచి ఉండకూడదని నిర్ణయించుకుంది. మిల్లర్లు తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులు, సమావేశం ఏకాభిప్రాయం కుదరక బెడిసికొట్టాయి.
మండిల్లోనే ధాన్యం బస్తాలు
మల్కన్‌గిరి: మిల్లర్ల ఆందోళనతో జిల్లాలోని వివిధ ధాన్యం మండీల్లో 77,429 క్వింటాళ్ల ధాన్యం బస్తాలు నిల్వ ఉండిపోయాయి. దీంతో వాటికి కాపలాగా ఉంటూ రైతులు అవస్థలు పడుతున్నారు. మొదటి దశలో జిల్లాలోని రైతుల నుంచి 5,50,400 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 1,50,585 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి లింగరాజ్ బెహరాను వివరణ కోరగా ఆందోళన నేపథ్యంలో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు.
నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు


