రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి గగుడిమాల్ గ్రామ సమీపంలో గల ఒక అటవీ ప్రాంతంలో ఒక చిన్నారి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కొరాపుట్ తరలించారు. కళ్యాణసింగుపూర్ ఐఐసీ నీలకంఠ బెహర తెలియజేసిన వివరాల ప్రకారం... ఈ నెల 11 వ తేదీన గగుడిమాల్ గ్రామానికి చెందిన అజిత్ నాగవంశ్ అనే వ్యక్తికి చెందిన ఏడాదిన్నర కొడుకు తప్పిపోయాడు. ఎంత వెతికినా జాడ లేకపోవడంతో కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నాడు గగుడిమాల్ గ్రామానికి చెందిన కొందరు బహిర్భూమికని అటువైపుగా వెళుతున్న సమయంలో పొదల నుంచి దర్వాసన రావడం గమనించి అక్కడకు వెళ్లి చూశారు. ఒక మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అజిత్ నాగవంశ్‌కు సమాచారం అందించారు. మృతదేహానికి ఉన్న చొక్కాను బట్టి అది తన కొడుకు మృతదేహమేనని అజిత్ స్పష్టం చేశాడు. అయితే గ్రామానికి ఇంత దూరంలో ఏడాదిన్నర చిన్నారి ఎలా వచ్చింది. ఇది హత్యా లేక మరేమైనా కారణం ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అడవిలో చిన్నారి మృతదేహం లభ్యం