● మరో నిందితుడి కోసం గాలింపు
● హత్యకు వినియోగించిన కోడి కత్తులు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన గన్నవరం డీఎస్పీ జయకృష్ణ
కంకిపాడు: డెయిరీ ఫామ్‌లో జరిగిన యువకుడి హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు సహకరించిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం గన్నవరం డీఎస్పీ జయకృష్ణ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని పునాదిపాడు ఫ్లై ఓవర్ అండర్‌పాస్ సమీపంలో శ్రీ రాజ్యలక్ష్మి డెయిరీ ఫామ్‌లో పని చేస్తున్న బిహార్ వాసి అనిల్‌కుమార్‌యాదవ్ (26) ఈనెల తొమ్మిదో తేదీ తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డెయిరీ ఫామ్ యజమాని పువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు మూడు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.
కక్షతోనే హత్య
బిహార్ రాష్ట్రం ముజాఫర్‌పూర్ చందన్‌పట్టి పోస్టు రసుపుల్‌మైయిరి ప్రాంతానికి చెందిన రాకేష్‌కుమార్ శ్రీరాజ్యలక్ష్మి డెయిరీఫామ్‌లో కార్మికుడిగా పనిచేసేవాడు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటంతో డెయిరీ యజ మాని అతడిని పని నుంచి తొలగించాడు. అతని స్థానంలో బిహార్‌కు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను పనిలోపెట్టుకున్నాడు. అనిల్‌కుమార్ పనిచేస్తుండగా రాకేష్‌కుమార్ కూడా కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. తనను పనిలో నుంచి తొలగించి అనిల్‌కుమార్‌ను పనిలో పెట్టుకోవ టంతో అతనిపై రాకేష్‌కుమార్ కక్షపెంచుకున్నాడు. అనిల్‌కుమార్‌యాదవ్‌ను పని మానుకోవాలని పలు మార్లు హెచ్చరించాడు. ఈ విషయమై తన బంధువైన మనీష్‌కుమార్‌కు చెప్పి రాకేష్‌కుమార్ బాధపడ్డాడు. ఇద్దరూ కలిసి అనిల్‌కుమార్ యాదవ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లో పనిచేస్తున్న రాకేష్‌కుమార్, మనీష్‌కుమార్ పెడనలోని ఓ ఫామ్‌లో కోడికత్తులను తీసుకున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీ రాత్రి మచిలీపట్నం నుంచి ద్విచక్రవాహనంపై మనీష్‌కుమార్ సోదరుడు అనీష్‌కుమార్‌తో కలిసి బయలుదేరి కంకిపాడు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత డెయిరీ ఫామ్ వద్దకు చేరుకుని గాఢ నిద్రలో ఉన్న అనిల్‌కుమార్‌యాదవ్‌పై రాకేష్‌కుమార్, మనీష్‌కుమార్ కోడికత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన అనిల్‌కుమార్‌ను స్థానికంగా మరో పాకలో నివాసం ఉంటున్న బిహార్ కార్మికులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనిల్‌కుమార్ మృతి చెందాడు. ఈ నెల 10వ తేదీన చలివేంద్రపాలెం సమీపంలోని ఐస్ క్రీమ్ కంపెనీ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు పునాదిపాడు డెయిరీఫామ్‌లో హత్యకు పాల్పడిన రాకేష్‌కుమార్, మనీష్‌కుమార్‌గా గుర్తించారు. వారు నేరాన్ని అంగీకరించటంతో నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరంతో సంబంధం ఉన్న అనీష్‌కుమార్ కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. హత్యకు వినియోగించిన రెండు కోడికత్తులు, పరారయ్యేందుకు వాడిన ద్విచక్రవాహనం, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశామని డీఎస్పీ జయకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ రవికుమార్, ఎస్‌ఐ కె.వై.దాసు తదితరులు పాల్గొన్నారు.


