నందిగామ రూరల్: మురసు తుపాను ప్రభావంతో రెండు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో దాములూరు కూడలి సమీపంలోని వైరా కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాజ్‌వేపై మూడడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. కాజ్‌వేపై రాకపోకలు సాగించకుండా కాపలా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ సురేష్‌బాబు తెలిపారు. వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు.
రాష్ట్ర గవర్నర్‌కు యూసీపీఐసీ వినతిపత్రం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు, చర్చిల కూల్చివేత, తప్పుడు కేసులను అరికట్టాలని యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ (యూసీపీఐసీ) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వినతిపత్రం అందజేసింది. యూసీపీఐసీ ప్రతినిధులు లోక్ భవన్‌లో గవర్నర్‌ను బుధవారం కలిశారు. రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ప్రార్థనా మందిరాల కూల్చివేత, అక్రమ కేసులు బనాయించి వేధించడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోక్‌భవన్ వద్ద యూసీపీఐసీ చైర్మన్ డాక్టర్ కోలా ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైస్తవులు, ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను గవర్నర్‌కు వివరించామని పేర్కొన్నారు. చర్చిల మరమ్మతులకు రూ.3 లక్షలు, ప్రతి గ్రామంలో క్రైస్తవ శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని, పాస్టర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని, దాడులపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్టు వివరించారు. క్రైస్తవులపై తప్పుడు కేసులను నిరోధానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జక్కంపూడి కాలనీ బ్లాక్ నంబరు 222లో మర్రి నాగిరెడ్డి, దేవి దంప తులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. దేవి కూలి పనులు చేస్తుంటుంది. మంగళ వారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండ టంతో దేవి ఇంటి వద్దే ఉంది. తుపాను కార ణంగా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేదు. రాత్రి సమయంలో ఫ్లాట్‌లోని సగం మందికి మాత్రమే విద్యుత్ సరఫరా వచ్చింది. దీంతో దేవి ప్లాట్ కిందకు దిగి మెట్ల వద్ద ఉన్న మీటర్ బాక్స్‌ను తెరిచి పరిశీలించే క్రమంలో విద్యుదాఘాగానికి గురైంది. ఆమె పెద్దగా కేక వేయడంతో పక్కనే ఉన్న లక్ష్మి వెంటనే కర్రతో కొట్టి విడిపించింది. అనంతరం దేవిని హుటాహుటిన కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. దేవి భర్త నాగిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని 1,266 పోలింగ్ కేంద్రాలకు బందోబస్తు నిమిత్తం 2,500 మంది పోలీస్, ఇతర భద్రతా సిబ్బందిని నియమిస్తూ ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 37 మంది సీఐలు, ఆర్‌ఐలు, 88 మంది ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 325 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లుతో పాటు మరో 630 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 410 మంది హోంగార్డులు, 123 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ సిబ్బంది, 282 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు, 380 మంది ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. డ్రోన్ కెమెరాల ద్వారా సున్నితమైన ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు విజ్ఞప్తి చేశారు.


