31వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయవాడ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి కూటమిని నమ్మే పరిస్థితులు లేవని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శ
సమన్వయం, సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధిద్దాం కార్పొరేటర్ అభ్యర్థుల సమావేశంలో దేవినేని అవినాష్
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ నగ రంలో వైఎస్సార్ సీపీ ఎన్ని కల ప్రచారం సోమవారం ముమ్మరంగా సాగింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్‌లో పార్టీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ అభ్యర్థి మండెపూడి ఛటర్జీతో కలిసి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాతశివాలయం వీధి కూడలి నుంచి ప్రారంభమైన ప్రచారం పులిపాటి వారి వీధి, కందుల వారి వీధి, సామారంగం చౌక్ పరిసర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మండెపూడి ఛటర్జీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పాలకులను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు, పారదర్శక పాలన అందించా రని గుర్తుచేశారు. ఆ అభివృద్ధి, సంక్షేమ పథకాలే నేడు పార్టీకి ప్రజల్లో కొండంత అండగా నిలిచాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికొదిలేసి, పాలనలో తీవ్రంగా విఫలమైందన్నారు. సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందన్నారు. ప్రజల్లో కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో డివిజన్ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగ ప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీనేతలు, కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ, సమష్టి కృషితో విజయమే లక్ష్యంగా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ప్రతి గడపకు వెళ్లి రెండున్నరేళ్లలో కూటమి కుతంత్రాలు, మోసాలను ప్రజలకు తెలియచేద్దామన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, అందిన సంక్షేమ పథకాలు, డివిజన్లలో జరిగిన అభివృద్ధిని తెలియజేద్దామని అవినాష్ సూచించారు. వారం రోజులే సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా డివిజన్లలో ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ అభ్యర్థులు, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.


