రంగంలోకి ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయవాడలోని బుద్ధా వెంకన్న ఇంటి వద్ద టీడీపీ నేతల ఆందోళన
వికటించిన ప్రయోగం..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమిలో రెబల్స్ బెడద నెలకొంది. విజయవాడ వెస్ట్‌లో తొలుత ఒక జాబితాను విడుదల చేశారు. తర్వాత బుధవారం నాడు నామినేషన్ల విత్‌డ్రా చివరిరోజున వేరే వారికి బీఫారం ఇచ్చారు. దీంతో వారు బుద్ధా వెంకన్న కార్యాలయం ముందు ఆందోళన చేశారు. 52వ డివిజన్‌లో తొలుత కొప్పుల గంగాధర్‌రెడ్డికి సీటు కేటాయించినట్లు ప్రకటించారు. తర్వాత ఈ సీటును బీజేపీకి కేటాయించి వేరే వారికి బీఫారం ఇచ్చారు. బుద్ధా వెంకన్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ సీటు కేటాయించేశారంటూ గంగాధరరెడ్డి ఆందోళన చేశారు. సీట్లు అమ్ముకున్నారంటూ తెలుగుదేశం నాయకులు బుద్ధా వెంకన్నపై ఆరోపణలకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సిటీ అంతా అంతే..
పాతబస్తీలో 31వ డివిజన్ సీటును అమ్ముకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. పార్టీకి సంబంధం లేని గడ్డం రవికి సీటు కేటాయించారు. 55వ డివిజన్ సీటు కూడా పార్టీకి సంబంధం లేని పెద్ది రమేష్‌కు కేటాయించడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు తమ సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పోటీకి దిగారు. ఈ స్థానంలో జనసేన సీటు కోసం ప్రయత్నించిన తాజా మాజీ అభ్యర్తి మహదేవు అప్పాజీ ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలవాలని నిర్ణయించారు.
● తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక 28వ డివిజన్‌లో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. రిజర్వేషన్లు ప్రకటించినప్పటి నుంచి 28వ డివిజన్ సీటు కోసం జనసేన, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కూటమి పొత్తులో భాగంగా తొలుత ఆ సీటు బీజేపీకి ఖరారు చేసినప్పటికీ ఇరుపార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీటు తనకు కావాలంటే తనకు కావాలని ఇద్దరు అభ్యర్థులు భీష్మించుకు కూర్చోవడంతో చేసేదేమిలేక బుధవారం ఇరువురికి ఆయా పార్టీలు బీఫారంలు ఇచ్చాయి. దీంతో అక్కడ జనసేన, బీజేపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తిరువూరులో తికమక..
తిరువూరు మునిసిపాలిటీలో కూటమి అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎదురవుతోంది. చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించగా, తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదని అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెనుమల్లి శ్రావణిని పోటీకి నిలబెట్టారు. అన్ని వార్డుల్లో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన అభ్యర్థులు వార్డు కౌన్సిలర్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయడంతో జిల్లా పార్టీ అధ్యక్షురాలు బుధవారం తిరువూరు వచ్చి ఇరువర్గాలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యాలయానికి రావలసిందిగా ఎమ్మెల్యే శ్రీనివాసరావును ఆహ్వానించగా, తనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కార్యాలయానికి రావడానికి అంగీకరించలేదు. చివరికి ఎమ్మెల్యే వర్గానికి చెందిన నలుగురు అభ్యర్థులకు కౌన్సిలర్ టికెట్లు ఇచ్చేందుకు ఒప్పించి చైర్మన్ పదవికి ఎమ్మెల్యే మద్దతుతో పెనుమల్లి శ్రావణి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించేందుకు అంగీకరించినా ఇంకా ఐదుగురు టీడీపీ రెబల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకోకుండా ముఖం చాటేశారు.
కొండపల్లి మునిసిపాలిటీలో 19వ వార్డులో టీడీపీ ప్రయోగం వికటించి కౌన్సిలర్ అభ్యర్థి లేకుండా పోయాడు. పెడన పురపాలక సంఘంలో కూటమి నుంచి బీజేపీ విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తోంది. పట్టణంలోని 15, 26 వార్డులలో బీజేపీ అభ్యర్థులు ప్రత్తిపాటి వెంకటరమణ, తాళ్ల వెంకట సుబ్రహ్మణ్యం బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా తెలుగుదేశం బరిలో ఉంది.


