తగరపువలస: దుర్గాదేవి అనుపు ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో బాణసంచా పేలి నలుగురు చిన్నారులు గాయపడ్డారు. విశాఖ జిల్లా వలందపేటలో బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారులు చిల్ల గౌతమ్, బాకి కార్తీక్, సరగడ షణ్ముఖసాయి తీవ్రంగా గాయపడగా చిల్ల సుశాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భీమిలి మండలం తాళ్లవలస వలందపేటకు చెందిన ఎస్‌కేఎంఎల్ వైజాగ్ రాక్‌స్టార్ దసరా ఉత్సవ కమిటీ దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తోంది. ఈ సందర్భంగా పేలుస్తున్న టపాసుల నిప్పురవ్వలు మరో వాహనంలో ఉంచిన బాణసంచా నిల్వపై పడడంతో క్షణాల్లో పేలుడు సంభవించింది.
ఈ ధాటికి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురై తలుపులు, కిటికీలు మూసుకున్నారు. బాణసంచా వాహనంలో ఉన్న చిన్నారులలో సుశాంత్ కిందకు గెంతడంతో పాదాలు కాలాయి. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో గౌతమ్, సుశాంత్ అన్నదమ్ములు. విశాఖకు చెందిన కార్తీక్ వలందపేటలో అమ్మమ్మ ఇంటికి దసరా పండగకు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా, గత ఏడాది అక్టోబర్ 3న దసరా సమయంలో ఇదే వలందపేటలో బాణసంచా తయారీలో మంటలు చెలరేగి ముగ్గురు గాయపడ్డారు.


