ఏపీపీఎస్సీలో ఎన్నో చిక్కులు.. ఎవరూ విప్పరు.. | Unemployed candidates express anger over APPSCs conduct | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీలో ఎన్నో చిక్కులు.. ఎవరూ విప్పరు..

Oct 23 2026 6:02 AM | Updated on Oct 23 2026 6:02 AM

Unemployed candidates express anger over APPSCs conduct

రిజర్వేషన్లు, జిల్లాల విభజనతో పలు మార్పులు  

రాష్ట్రపతి ఉత్తర్వులు–2025తో అనేక చేర్పులు 

ఈడబ్ల్యూఎస్‌ కోటా,మైగ్రేషన్‌ పైనా ఫిర్యాదులు 

నిరుద్యోగ అభ్యర్థులకు సమాధానం ఇవ్వని సర్వీస్‌ కమిషన్‌  

కనీసం రిడ్రెస్సెల్‌ సెల్‌ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం  

ఈ నెల 27తో ముగుస్తున్న గ్రూప్‌–1 దరఖాస్తు గడువు  

ఏపీపీఎస్సీ తీరుపై నిరుద్యోగ అభ్యర్థుల ఆగ్రహం

వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి చదువు 1 నుంచి 5వ తరగతి వరకు అదే జిల్లాలో సాగింది. 6, 7 తరగతులు అనంతపురం జిల్లాలో పూర్తిచేశాడు. ఇటీవల జిల్లా విభజనతో పాటు కొత్త జోనల్‌ విధానం రావడంతో వైఎస్సార్‌ కడప జిల్లా ఐదో జోన్‌లో ఉండగా, అనంతపురం ఆరో జోన్‌లోకి వెళ్లింది. ఇప్పుడు సదరు అభ్యర్థి గ్రూప్‌–1కి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడు ఏ జోన్‌ పరిధిలో స్థానికుడు అవుతాడో తెలియక సతమతమవుతున్నాడు. ఈ సమస్య గురించి అనేకసార్లు ఏపీపీఎస్సీకి కాల్‌ చేసినా పరిష్కారం దొరక్కపోవడంతో పాటు సిబ్బంది నుంచి ‘మాకు తెలియదు’ అన్న ఒక్క సమాధానం మాత్రమే వస్తోందని ఆవేదన చెందుతున్నాడు.  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) తీరు నిరుద్యోగ అభ్యర్థులకు శాపంగా మారింది. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన సర్వీస్‌ కమిషన్‌.. వాటిపై వచ్చే అనుమానాలను నివృత్తి చేయడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లలో పేర్కొన్న అంశాలపై సందేహాల నివృత్తికి వివిధ జిల్లాల నుంచి దరఖాస్తుదారులు సర్వీస్‌ కమిషన్‌కు ఫోన్‌ చేస్తుంటే ‘మాకు తెలియదు’ అన్న సమాధానం మాత్రమే వస్తోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం సామాజిక రిజర్వేషన్లలో మార్పులు తెచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 అమల్లోకి వచ్చాయి. అలాగే జోనల్‌ విధానంలో మార్పులు జరిగాయి. దీంతో ఆయా అంశాలపై అభ్యర్థులను ఎన్నో సందేహాలు వెంటాడుతున్నాయి. ఆ సందేహాలను తొలగించాల్సిన సర్వీస్‌ కమిషన్‌ పట్టనట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. 

దరఖాస్తు చేసుకోలేని చిక్కులు  
ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్‌–1, 2తో సహా పలు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కొన్నింటికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అందులో ప్రధానమైన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువు ఈనెల 27వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఓటీపీఆర్‌ కష్టాలను ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తేవడంతో అంతవరకు పరిష్కరించారు. కానీ ముఖ్యమైన ఈడబ్ల్యూఎస్, స్థానికత, మైగ్రేషన్, లోకల్‌ స్టేటస్‌ వంటి అంశాలపై అభ్యర్థుల సందేహాలు తీరడంలేదు. 

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో జీవో నం.161 ప్రకారం 2014 జూన్‌ 2 నుంచి 2024 జూన్‌ ఒకటో తేదీ వరకు ఉన్న కాలానికి ప్రామాణికంగా మైగ్రేషన్‌ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కానీ అంతకు ముందు, 2024 జూన్‌ ఒకటో తేదీ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారి పరిస్థితి ఏంటో చెప్పలేదు. వివిధ జిల్లాల్లో చదువుకున్నవారి స్థానికతపై గందరగోళం నెలకొంది. మల్టీ జోనల్‌ విధానం అమలుతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ అనుమానాలను తీర్చాల్సిన ఏపీపీఎస్సీ తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది.  

రిడ్రెస్సెల్‌ సెల్‌ ఏది? 
విధానపరమైన మార్పులు, చట్టాలు చేసినప్పుడు వాటిపై సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఆయా సంస్థలకు ఉంది. కానీ కూటమి ప్రభుత్వం పలు విధానపరమైన చట్టాలను మార్చిన అనంతరం ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ క్రమంలో సందేహాలను తీర్చేందుకు ఏ విభాగంలో ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో గుర్తించి వాటిపై వెబ్‌నోట్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేయాలి. కానీ చేయలేదు. 

అలాగే నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుదారుల ఫిర్యాదులను తీసుకుని సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా కమిషన్‌ కార్యాలయంలో ఫిర్యాదుల పరిష్కార విభాగం (రిడ్రెస్సెల్‌ సెల్‌) ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. చేయలేదు. దీంతో పలువురు అభ్యర్థులు తమ దరఖాస్తులు రిజెక్ట్‌ అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అన్నీ సక్రమంగా నమోదు చేసినా తప్పు ఎక్కడ జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఏపీపీఎస్సీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరైన సమాధానం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement