టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని మరో బిహార్‌లా మారుస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం పార్టీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ‘చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాక్షేత్రంలో గెలుపు ధీమాలేక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. నామినేషన్ పత్రాలను చించివేయడం, మహిళలపై దాడులు, గర్భిణులను బెదిరించడం, ప్రతిపక్ష నేతల అరెస్టులు వంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో అక్రమాలపై అక్టోబర్ 21న సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అభ్యర్థుల హక్కుల పరిరక్షణకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అక్టోబర్ 22న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతల నిర్బంధం, దాడులు, అడ్డగింతలు, నామినేషన్ పత్రాల చించివేత వంటి దారుణాలకు అధికార పార్టీ ఒడిగట్టింది. పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ ఇప్పటికైనా స్పందించాలి.
నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలి. వారికి తక్షణ రక్షణ కల్పించాలి. వీడియో ఆధారాలను భద్రపరచాలి. దాడులకు పాల్పడిన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. దాడులకు సంబంధించిన వీడియో ఆధారాలను పరిశీలించి ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ మీడియా కూడా తన వంతు పాత్ర పోషించాలి ’అని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేసిన పార్టీ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అధికార పార్టీ గూండాల దాష్టీకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.


