ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసే టెండర్లు రద్దు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం తెల్లవారు జామున మొదటి డ్యూటీ నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు నేషనల్ మజ్దూర్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి.శ్రీనివాసరావు, ఎస్. రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,450 విద్యుత్ బస్సుల కొనుగోలుకు ప్రైవేట్ టెండర్ పిలవడం దుర్మార్గమన్నారు. తక్షణం టెండర్ రద్దు చేసి సంస్థ ద్వారానే బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ ఉద్యోగుల ద్వారానే బస్సులు నడపాలని సూచించారు. యూనియన్ నాయకులు బీఎన్ రావు, ఆంజనేయులు, సీహెచ్ నాగేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో జెడ్పీ విద్యార్థుల ప్రతిభ
మూలపాడు(ఇబ్రహీంపట్నం): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మూలపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థులు రజిత, కాంస్యం పతకాలు సాధించారని పాఠశాల హెచ్‌ఎం డేవిడ్ రాక్‌ఫెల్లర్ గురువారం తెలిపారు. విద్యార్థులు వి.సుధీర్ అండర్ 17 విభాగంలో 71 కిలోల కేటగిరీలో రజిత పతకం, ఎన్‌హెచ్ నారాయణమూర్తి అండర్ 19 విభాగంలో 71 కిలోల కేటగిరీలో కాంస్య పతకం సాధించారు. టి.సాయివర్ధన్ నాలుగో స్థానంలో నిలిచారని చెప్పారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.కె. రషీద్, మొహమ్మద్ వహీదా బేగం, పాఠశాల సిబ్బంది అభినందించారు.


