మహిషాసురమర్దినీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం తరలివస్తున్న భవానీ భక్తులు నేడు పూర్ణాహుతితో దసరా ఉత్సవాల ముగింపు సాయంత్రం హంసవాహనంపై ఆదిదంపతుల తెప్పోత్సవం
నేటితో ఉత్సవాలు పరిసమాప్తం
9వ రోజు ఆదాయం రూ.42.17 లక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. అంతరాలయం, ఇంద్రకీలాద్రి, కనకదుర్గానగర్ ఇలా అన్ని చోట్లా భక్తజన సందోహం కనిపిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీమహిషాసుర మర్దినీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి విశేష ఖడ్గమాలార్చన, విశేష కుంకుమార్చన, విశేష శత చండీహోమం, విశేష శ్రీచక్రనవార్చనలు నిర్వహించారు. దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరు కోవడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, భవానీ మాలధారుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భవానీలతో క్యూలైన్లతో పాటు ఆలయ ప్రాంగణం, అన్నప్రసాద భవనం, గోశాల మార్గం, కనకదుర్గనగర్ ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నాయి.
నేటి అలంకారం శ్రీరాజరాజేశ్వరీదేవి
దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాల్లో పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా, శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరీదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా శ్రీకనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది.
సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం
దసరా మహోత్సవాలు ముగింపును పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు పవిత్ర కృష్ణానదిలో హంసవాహనంపై విహరిస్తారు. ఏటా దసరా ఉత్సవాల ముగింపు రోజున ఆదిదంపతులు నదీ విహారం చేయడం ఆనవాయితీ. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి శ్రీగంగాపార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు చేరుకుంటారు. దుర్గాఘాట్‌లో ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం హంసవాహనాన్ని అధిరోహించి మూడు పర్యాయాలు నదీలో విహరిస్తారు. రాత్రికి బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో శమీపూజ, పారువుటోత్సవం సంప్రదా యబద్ధంగా జరుగుతాయి.
6.83 లక్షల మందికి అల్పాహారం, అన్నప్రసాదం
దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు నిరంతరం నిత్యం అల్పాహారం, అన్న ప్రసాదం పంపిణీచేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అన్నదాన భవనంలో ఉత్సవాల్లో తొమ్మిది రోజుల వరకు 6.83 లక్షల మందికి అల్పాహారం, అన్న ప్రసాదం అందజేశారు. గోశాల సమీపంలో ఐదు రోజులుగా 1.20 లక్షల మందికి కదంబం, పులిహోర, కట్టెపొంగలి ప్రసాద వితరణ చేస్తున్నారు. వీటితో పాటు జీరరైస్, ఉప్మా, పులిహోర 200 గ్రాముల ప్యాకెట్లు 1.40 లక్షల వరకు పంపిణీ చేయడం విశేషం.
ఆదిదంపతులకు ప్రత్యేక పూజలు
దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నగరోత్సవ సేవ వైభవంగా జరిగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ప్రారంభమైన ఆదిదంపతుల ఊరేగింపు కనుల పండువగా సాగింది. తొలుత యాగశాల వద్ద పూల పల్లకీని అధిరోహించిన ఆదిదంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ శీనానాయక్ కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఓ పల్లకీని తమ భుజాలపై మోస్తూ ముందుకు సాగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగిన ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు, ఆలయ అధికారులు, సేవా సిబ్బంది పాల్గొన్నారు. గ్రామోత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట అస్థాన సేవ నిర్వహించారు.
తెప్సోత్సవానికి సిద్ధమైన హంస వాహనం
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలు మంగళ వారంతో ముగియనున్నాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేస్తారు. అనంతరం వేద ఆశీర్వచనం ప్రసాద వితరణ జరుగుతుంది.
దసరా ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన సోమవారం రూ.42.17 లక్షల మేర ఆదాయం సమకూరిందని దుర్గగుడి అధికారులు తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.39.50 లక్షలు, కేశఖండన టికెట్ల విక్రయం ద్వారా రూ.2.37 లక్షలు, అమ్మవారి ఫొటోలు, క్యాలెండర్లు విక్రయం ద్వారా మిగిలిన ఆదాయం లభించిందని వివరించారు.


