జనహారం | - | Sakshi
Sakshi News home page

జనహారం

Oct 22 2026 4:02 AM | Updated on Oct 22 2026 4:02 AM

జల విహారం.. జనహారం

పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు లడ్డూ ప్రసాదాల కొరతతో భవానీల ఇబ్బందులు శుక్రవారం వరకూ ఇవే ఏర్పాట్లు కొనసాగుతాయన్న దేవస్థాన అధికారులు

బ్రేక్‌, వీఐపీ దర్శనాలు రద్దు

జల విహారం..

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదిదంపతులకు హంసవాహన సేవ కనుల పండువగా సాగింది. గత ఏడాది కృష్ణానదికి వరద నేపథ్యంలో హంస వాహన సేవ నదీ తీరానికే పరిమితం కాగా, ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో వేడుకగా జరిగింది. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణ, వేద పఠనం, విద్యుత్‌ దీపకాంతులు, టపాసుల వెలుగులలో హంస వాహనంపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి మూడు పర్యాయాలు నదీలో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఆదిదంపతుల హంస వాహన సేవను వీక్షించేందుకు ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల భక్తులు నదీ తీరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్‌, దుర్గగుడి ఫ్లై ఓవర్‌, భవానీ ఘాట్ల నుంచి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. సాయం సంధ్య వేళ దుర్గా ఘాట్‌లో కృష్ణమ్మకు నవ హారతులను ఇవ్వగా, అదే సమయంలో హంస వాహన సేవ జరిగింది. ఒకే సమయంలో రెండు సేవలను వీక్షించే మహాభాగ్యం భక్తులకు కలిగింది. హంస వాహన సేవతో ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా ఉత్సవాలు ముగిశాయి.

నగరోత్సవం.. నయనానందకరం

మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ఆదిదంపతుల నగరోత్సవం బయలుదేరింది. ఆలయ అధికారులు ఆదిదంపతుల పల్లకీకి భుజం పట్టగా, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తజనుల కోలాట నృత్యాల మధ్య దుర్గాఘాట్‌కు బయలుదేరింది. ఊరేగింపులో బేతాళ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు ఆకట్టుకున్నాయి. దుర్గగుడి ఈవో శీనానాయక్‌, కలెక్టర్‌ లక్ష్మీశ కేరళవాయిద్యాలను లయబద్ధంగా వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. దుర్గాఘాట్‌కు చేరుకున్న ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. హంసవాహనంపైకి పరిమిత సంఖ్యలోనే అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులను అనుమతించారు. దుర్గాఘాట్‌ నుంచి సేవను వీక్షించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పలువురు ప్రముఖులు సేవను వీక్షించారు.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి ఎటువంటి సిఫార్సు, బ్రేక్‌, వీఐపీ దర్శనాలకు అనుమతించలేదని దుర్గగుడి ఈవో శీనానాయక్‌ పేర్కొన్నారు. ప్రజా ప్రతి నిధులు, రాజకీయ ప్రముఖులు చేసిన ిసిఫార్సుల ద్వారా దర్శనాలకు అనుమతి లేదని, అయితే స్వయంగా విచ్చేసే ప్రొటోకాల్‌ పరిధిలోకి తీసుకుని నిబంధనల మేరకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.

లోక పావని జగన్మాత.. ఆ పక్కనే గంగా మల్లేశ్వరులు హంస వాహనంపై కొలువుదీరి అలల దారుల్లో మెల్లగా.. విద్యుత్‌ దీప కాంతులు, మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల మధ్య విహరిస్తుంటే.. ఒడ్డున ఉన్న జనమే కాదు.. నదిలోని జలమూ పులకించింది. దసరా మహోత్సవాల్లో ఆఖరి ఘట్టం తెప్పోత్సవం

విజయదశమి నాడు కనుల పండువగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement