పార్ట్‌టైం టీచర్ల శ్రమను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

పార్ట్‌టైం టీచర్ల శ్రమను గుర్తించాలి

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

పార్ట్‌టైం టీచర్ల శ్రమను గుర్తించాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో పనిచేసే పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ అన్నారు. పార్ట్‌టైం ఉద్యోగులు అయినప్పటికీ వారి చేత ఫుల్‌ టైం పని చేయించుకుంటున్నారన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులుగా ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. అంబేడ్కర్‌ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం టీచర్స్‌, లెక్చరర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష చేపట్టారు. మూడో రోజు దీక్షకు వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.

జగన్‌ వద్దకు తీసుకెళ్తాం..

ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ పార్ట్‌టైం ఉపాధ్యాయులు, అధ్యాపకుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. పార్ట్‌టైం ఉద్యోగులను కాంట్రాక్ట్‌ విధానంలోకి మార్చాలని, నెల నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలన్నారు. 15 డిమాండ్లతో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో నారా లోకేష్‌, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరికీ న్యాయం చేయడం లేదన్నారు. ధర్నా చౌక్‌లో ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు తమ బాధలను చెప్పుకుంటున్నా స్పందించడం లేదని అన్నారు. సచివాలయ ఉద్యోగులు, చదువుకున్న యువత రోడ్డెక్కడి ప్రశ్నిస్తే కేసులతో పాటు, వారిపై మీడియా ద్వారా ‘రౌడీలు’, ‘గూండాలు’ అని నిందలు వేయడం దారుణమని పేర్కొన్నారు. పార్ట్‌టైం ఉద్యోగులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్ట్‌టైం ఉద్యోగుల వినతి పత్రాన్ని వైఎస్‌ జగన్‌కు అందజేస్తామని, సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. అసోసియేషన్‌ ప్రతినిధులను వైఎస్‌ జగన్‌ వద్దకు తీసుకెళ్తామన్నారు.

● ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ గురుకులాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆందోళన చేసిన వాళ్లపై ప్రభుత్వం విష ప్రచారం చేస్తోందన్నారు. గంజాయ్‌ బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ నిందలు వేస్తున్నారన్నారు. ఉద్యోగుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.

● ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్ట్‌టైం ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పార్ట్‌ టైం ఉద్యోగుల నిరసన న్యాయమైనదన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్వందించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పోరాటానికి వైఎస్సార్‌ సీపీ తోడుగా ఉంటుందన్నారు. ఈ ధర్నాలో బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల ఉపాధ్యాయులు, అధ్యాపకుల అసోసియేషన్‌ ప్రతినిధులు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీవైఎప్‌ఐ, ఇఫ్టూ, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.

ధర్నాలో మాట్లాడుతున్న దేవినేని అవినాష్‌

ధర్నా చౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గురుకులలో పని చేస్తున్న టీచర్లు

వైఎస్సార్‌ సీపీ నేతలు అవినాష్‌, మల్లాది విష్ణు, వెలంపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement