పారామెడికల్‌ బోర్డు సెక్రటరీగా సుమైల కొనసాగింపు | - | Sakshi
Sakshi News home page

పారామెడికల్‌ బోర్డు సెక్రటరీగా సుమైల కొనసాగింపు

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

పారామెడికల్‌ బోర్డు సెక్రటరీగా సుమైల కొనసాగింపు స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు.. క్రెడిట్‌ ఆఫీసర్‌ ఆత్మహత్య

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్‌ పారా మెడికల్‌ బోర్డు సెక్రటరీగా బి. సుమైల మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె గతంలో సిద్ధార్థ వైద్య కళాశాలలో అడ్మినిష్ట్రేషన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఫారిన్‌ సర్వీసుపై రెండేళ్ల కాల పరిమితితో 2024 అక్టోబరులో పారామెడికల్‌ బోర్డు సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరుతో కాలపరిమితి ముగియనుంది. ఈ తరుణంలో మరో రెండేళ్లు ఆ పదవిలో కొనసాగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి. వీరపాండ్యన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నష్టాలు ఓ ప్రైవేటు ఉద్యోగి ఉసురు తీశాయి. ఈ ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ బుధవారం కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ నందమూరినగర్‌ ప్రాంతానికి చెందిన భోజనపు కల్యాణ్‌కుమార్‌ (34) కృష్ణలంక యూనియన్‌ బ్యాంకులో క్రెడిట్‌ ఆఫీసర్‌గా పని చేస్తుంటాడు. ఇతనికి వరంగల్‌ జిల్లా సంగీయ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన దామెర్ల కవిత అనే ప్రభుత్వ టీచర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప, బాబు సంతానం ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం భార్య కవిత అక్కడే తన పుట్టింటి వద్ద ఉంటూ అప్పుడప్పుడు విజయవాడ వచ్చి వెళ్తూ ఉంటుంది. కల్యాణ్‌ కుమార్‌కు స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేయడం అలవాటు. అందులో పెట్టుబడులు పెడుతూ ఉండేవాడు. ట్రేడింగ్‌లో దెబ్బతినడంతో సుమారు రూ.1.5 కోట్ల వరకూ నష్టపోయాడు. ఆ నష్టం భరించలేక బ్యాంకు లోన్లు తీసుకోవడం, తెలిసిన వారి వద్ద మరికొంత అప్పులు చేయడంతో ఆయనపై అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. దీంతో వాటిని భరించలేక మంగళవారం రాత్రి ఇంటిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నువ్వు.. పిల్లలు జాగ్రత్త...

రోజూ భార్య కవితకు ఫోను చేసి మాట్లాడే కల్యాణ్‌కుమార్‌ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో భార్యతో మాట్లాడాడు. నువ్వు.. పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోను పెట్టేశాడు. భర్త నుంచి మళ్లీ ఫోన్‌ రాకపోవడంతో కవిత రాత్రి 10 గంటలకు మరల కల్యాణ్‌కు ఫోన్‌ చేయగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. బుధవారం ఉదయం నిద్రలేచి ఫోను చేసినప్పటికీ కల్యాణ్‌ ఫోన్‌ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె వారికి తెలిసిన వ్యక్తినీ తన భర్త ఉంటున్న నందమూరి నగర్‌ ఎస్వీఎస్‌ ఎంక్లేవ్‌కు పంపింది. ఆ వ్యక్తి వచ్చి ఎంతసేపు తలుపు కొట్టిన తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపును పగలగొట్టి చూడగా హాల్లో ఉన్న ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని కల్యాణ్‌ వేలాడుతూ కనిపించాడు. వెంటనే వైద్యులను పిలిచి పరీక్షించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement