విజయవాడలీగల్: విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న న్యాయవాదులపై పోలీసులు లాఠీచార్జ్ చేయలేదని, పోలీసుల వద్ద లాఠీలే లేవంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ విడుదల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని బార్ అసోసియేషన్ ఖండించింది. బుధవారం కోర్టు కాంప్లెక్స్‌లో బెజవాడ బార్ అసోసియేషన్(బీబీఏ) హాలులో న్యాయవాదులు నిరాహారదీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీబీఏ అధ్యక్షుడు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలీసుల చేతుల్లో నాలుగు అడుగుల లాఠీలు ఉన్న దృశ్యాలతో కూడిన దాదాపు 20 ఫొటోల ఆధారాలు తమ వద్ద స్పష్టంగా ఉన్నాయని వెల్లడించారు.
పోలీసుల దుశ్చర్యలు..
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసు అధికారులతో ముందుగా చర్చించి, వారి సూచనల మేరకే సమయం మార్చుకుని న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ప్రశాంతంగా బయలుదేరిన తమపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏళ్ల సీనియర్ న్యాయవాది గౌతంరెడ్డిపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని, చికిత్స కోసం ఐసీయూలో చేర్చాల్సి వచ్చిందని తెలిపారు. ఘటనలో మహిళా న్యాయవాది పసుపులేటి శ్రీదేవిపై చేయి చేసుకుని, జడ పీకేసి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సంఘటనా స్థలంలో కనీసం ఒక్క మహిళా పోలీసు కూడా లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. లాయర్లపై జరిగిన దాడులను సమర్థించుకుంటూ, పత్రికల్లో వచ్చిన నిజాలను కప్పిపుచ్చేందుకు పోలీస్ కమిషనరేట్ అభూతకల్పనలతో ప్రకటనలు ఇస్తున్నారని బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా..
విజయవాడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 142 బార్ అసోసియేషన్లు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తూ విధులను బహిష్కరించారని చెప్పారు. గురు, శుక్రవారాలలో కూడా శాంతియుత నిరసనలు తెలుపుతూ రాష్ట్రంవ్యాప్తంగా విధులను బహిష్కరించనున్నట్లు లక్ష్మీనారాయణ ప్రకటించారు. నిరాహార దీక్షలో సీనియర్ న్యాయవాది, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి, ఒగ్గు గవాస్కర్, అబ్దుల్ రజాక్, ఆదాంకుమార్, బూదాల సౌమ్య, పొట్లూరి ప్రశాంతి, బుర్రా దయామణి, యడ్ల సుజాత, నరహరిశెట్టి జ్యోతి, ఓగిరాల సునీత, కొత్త మహేశ్వరి, సుభాని, ప్రతాప్, కంతేటి విజయ్‌కుమార్, గడ్డం రవికుమార్ పాల్గొన్నారు.
న్యాయవాదులకే రక్షణ లేకపోతే..
సీనియర్ న్యాయవాది పూనూరు గౌతమ్‌రెడ్డి రిలే నిరాహారదీక్షలో పాల్గొని, ప్రసంగిస్తూ ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేసే న్యాయవాదులకే రాష్ట్రంలో రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఒగ్గు గవాస్కర్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
దురుసు ప్రవర్తన చేయలేదు..
లబ్బీపేట(విజయవాడతూర్పు): న్యాయవాదులంటే తమకు ఎంతో గౌరవం ఉందని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంత మంది న్యాయవాదులు తమ డిమాండ్స్‌పై నిరసన తెలిపే సమయంలో, అదే రూట్‌లో ముఖ్యమంత్రి జెడ్‌ప్లస్ కాన్వాయ్ పర్యటన ఉండటం, ఆ సమయంలో వీఐపీ భద్రత, సాధారణ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కేవలం రెండు నిమిషాలు ఆగాలని కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించడంతో ఆ సమయంలో పోలీసులు వారికి నచ్చచెప్పి, అంబేడ్కర్ స్మారక ద్వారం వద్దకు పంపగా, వారు వినతి పత్రం సమర్పించారని తెలిపారు. న్యాయవాదుల పట్ల ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదని, పోలీసుల చేతిలో లాఠీలు సైతం లేవని ఆ ప్రకటనలో తెలిపారు.


