విజయవాడ నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భవానీ పురం హెచ్‌బీ కాలనీ, ఇందిరా ప్రియదర్శిని కాలనీ రోడ్లలో మోకాలి లోతున నీరుచేరింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని రైల్వే బ్రిడ్జి కింద, సుందరయ్య నగర్, ఉడా కాలనీ, ఏలూరు రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్, పాత పిన్నమనేని క్లినిక్ రోడ్డు, రామవరప్పాడు, ప్రసాదంపాడు రోడ్లు నీటమునిగాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. పాత ఇళ్లలో ఉండే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎంఐజీలో శ్లాబులు దెబ్బతిన్న ఇళ్లలో నివసించే వారిని వేరే ఇళ్లల్లోకి వెళ్లాలని సూచించారు. గొల్లపూడిలోని బైపాస్ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నీటమునిగింది.


