ముసురుకున్న కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ముసురుకున్న కష్టాలు

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షం 39.88 మి.మీ. వర్షపాతం ● తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం తోటమూల – వినగడప మధ్య కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో ఇక్కడ కాజ్‌వే కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ జి.లక్ష్మీశ తోటమూల వద్ద కట్టలేరును గురువారం పరిశీలించారు. ● మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి సమీపంలో ఏనుగుగడ్డ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చినలంక, పెదలంకకు రాకపోకలు స్తంభించాయి. కిలేశపురం, మూలపాడు వద్ద ఏనుగుగడ్డ వాగు చప్టాపైకి వరద నీరు చేరడంతో రైతులు పొలాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. కొటికలపూడి, మూలపాడు గ్రామాల్లో అధిక వర్షాలకు పత్తి, మిర్చి, టమాటా, క్యాలీఫ్లవర్‌, మినుము చేలల్లోకి వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో ఈ పైర్లకు నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని వత్సవాయి మండలంలో కొన్ని చోట్ల మిర్చి పొలాల్లోకి నీరు చేరింది. ఈ ప్రాంతంలో మెట్ట పైర్లకు వర్షాలు కొంత ఊరట ఇచ్చాయని రైతులు చెబుతున్నారు. ఇక్కడ పంటల పరిస్థితిని జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ పరిశీలించారు. మున్నేరు స్వల్పంగా వరద నీరు వచ్చింది. వర్షం మరో రోజు కొనసాగితే వివిధ దశల్లో ఉన్న పత్తికి నష్టమని రైతులు చెబుతున్నారు. ● నందిగామ నియోజకవర్గంలో ప్రధానంగా కట్టలేరు, వైరా యేరు, ఏనుగుగడ్డ వాగుల్లోకి నీరు వచ్చిచేరింది. మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో పంట పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కూడలి వద్ద దాములూరు, పల్లంపల్లికి మధ్యలో కట్టలేరు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపుగా నందిగామకు రాకపోకలు స్తంభించాయి. చెవిటికల్లు, కంచికచర్ల మధ్య వాగు పొంగింది.

కట్టలేరు, వైరాయేరు, మున్నేరుకు వరద ఉధృతి

పంటపొలాల్లోకి చేరిన వర్షపు నీరు

విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం

కట్టలేరు ఉధృతితో 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

వాయుగుండం ప్రభావంతో కుండపోత వర్షం

ఎన్టీఆర్‌ జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు 39.88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువూరులో అత్యధికంగా 59.4 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నం 56.4, విజయవాడ సెంట్రల్‌ 53.2, విజయవాడ వెస్ట్‌ 53.2, రెడ్డిగూడెం 50.2, కంచికచర్ల 47.2, విజయవాడ రూరల్‌ 46.2, విజయవాడ ఈస్ట్‌ 45.2, ఎ.కొండూరు 42.6, విస్సన్నపేట 41.2, విజయవాడ నార్త్‌ 40.6, వీరులపాడు 39.8, గంపలగూడెం 38.2, నందిగామ 36.2, గడ్డమణుగు కొండూరు 32.9, చందర్లపాడు 30.4, మైలవరం 26.4, వత్సవాయి 21.8, జగ్గయ్యపేట 19.6, పెనుగంచిప్రోలులో 17.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బంగాళాఖా తంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎన్టీఆర్‌ జిల్లాలో గురువారం కూడా కుండపోతగా వర్షం కురిసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షం లేదు. సీజన్‌ మొత్తం మీద 45 నుంచి 52 శాతం లోటు వర్షపాతం ఉంది. మెట్ట పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కట్టలేరు, వైరాయేరు, ఏనుగడ్డ వాగు, ఇతర వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు, బుడమేరులో ఈ ఏడాది తొలి సారిగా స్వల్పంగా వరద నీరు చేరింది. బుడమేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఏడు అడుగుల మేర వరద నీరు చేరింది. మెట్ట ప్రాంతాల్లోని పల్లపు పొలాల్లోకి అక్కడక్కడ వర్షపు నీరు నిలిచింది. నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండలకు వాడిపోయిన పత్తి పైరు, నేడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూత రాలిపోయి గొడుగులెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌ పరిశీలన

మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గంపలగూడెం మండలంలోని కట్టలేరు వంతెన ప్రాంతంలో వరద పరవళ్ళు తొక్కుతున్న వంతెన ప్రదేశాన్ని కలెక్టర్‌ జి.లక్ష్మీశ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరద ప్రభావిత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కొనిజెర్ల–నెమలి మధ్య నల్లవాగు వరదతో ఉగ్రరూపం దాల్చడంతో దైవ దర్శనానికి ఆటంకం ఏర్పడింది. తిరువూరు మండలం చింతలపాడులో ఈదురుగాలులు, భారీవర్షాలకు ధ్వంసమైన ఇళ్లను కలెక్టర్‌ పరిశీలించి బాధితులను పరామర్శించారు.

నేడు విద్యా సంస్థలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లాలోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు శుక్రవారం కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు అమలు చేయాలని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement