రెండున్నరేళ్లుగా హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
ఆ హామీల అమలుకు ఖజానా ఖాళీ అంటూ బీద అరుపులు
ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకు పింఛన్, నిరుద్యోగ భృతికి స్వస్తి
ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట ప్రచార ఆర్భాటాలకు ఖర్చుచేసే యత్నం
ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న మేధావులు, పౌరసమాజం
సాక్షి, విజయవాడ: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు సహా కూటమి నాయకులు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. ఆ హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులతో భయపెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసినా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అయితే ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట ప్రజలను మాయ చేసే కుట్రలకు తెరలేపారు. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తూ కూటమి నేతలు రూ.కోట్లు గడిస్తున్నారు. నిన్నటి వరకు ఐటీడీపీ కార్యకర్తలకు పరోక్షంగా ఆర్థిక లబ్ధి చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలంటూ ఇన్‌ఫ్లుయెన్సర్ల జేబులు నింపే చర్యలకు తెగబడింది. ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. ఏ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయని ప్రభుత్వం, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజాధనం చెల్లించాలన్న నిర్ణయంపై ప్రజాసంఘాలు, మేధావులు, నిరుద్యోగ యువత, మహిళలు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి ఒక్కో వీడియోకు కొంత మొత్తం చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు.
ప్రచారానికి ఇంత ప్రాధాన్యమా?
ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం అవసరమే. అందు కోసం ప్రజాధనాన్ని ఇలా ఖర్చు చేస్తారా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఏమీ చేయని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రచార వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. నిజంగా ప్రభుత్వం మంచి చేస్తుంటే, సక్రమంగా పథకాలు అందిస్తే, లబ్ధిదారుల అనుభవాలే చాలని పేర్కొంటున్నారు. ప్రజలకు ఏమీ చేయకుండానే, ప్రజల సొమ్ముతో ప్రచారం చేయించేకోవడం ఏమిటని ఎద్దేవాచేస్తున్నారు.
హామీల అమలు ఎక్కడ?
కొత్త పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 2024 ఎన్నికల నాటి కూటమి హామీలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంత వరకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లిస్తామని, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం, 50 ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్ పథకాలు ఏమయ్యాయి బాబూ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు హామీల అమలుపై ఎవరైనా ప్రశ్నిస్తే కూటమి పెద్దలు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తమ అభిప్రాయం చెప్పినా సంక్షేమ పథకాలు నిలిపివేయడం, వారి ఇళ్లకు వెళ్లి భయపెట్టడం వంటి చర్యలకు తెగబడుతున్నారు.


