కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, మౌలిక వసతుల కల్పనపై ఎయిర్‌పోర్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ ఎ. లక్ష్మీకాంత్‌రెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం తహసీల్దారు కె.వి.శివయ్య తదితరులు పాల్గొన్నారు.


