దేశభక్తితో పాటు రాష్ట్ర భక్తిని కూడా పెంపొందించుకోవాలి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అజిత్‌సింగ్‌నగర్‌లో తొలిసారి కనుల పండువగా మువ్వన్నెల జెండా పండుగ
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలను చేసిన సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కుల, మత, ప్రాంతాలకతీతంగా కలసి ముందడుగు వేద్దామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్స్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ పిలుపు నిచ్చారు. 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు–2026 విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ స్టేడియంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి లోకేష్ ముందుగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం లోకేష్ ప్రసంగిస్తూ జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య పుట్టిన గడ్డపై జెండాను ఎగరవేయడం గొప్పవరంగా భావిస్తున్నానన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపైనే కాదు.. ప్రతి గుండెలోనూ మన జెండా ఎగరాలన్నారు. ప్రతి ఒక్కరూ దేశ భక్తితో పాటు రాష్ట్ర భక్తిని కూడా పెంపొందించుకోవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే జోడెద్దుల బండిపై కూటమి ప్రభుత్వం సవారీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు, పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేసిన విన్యాసాలు అలరించాయి. అనంతరం జిల్లాలోని పలు శాఖల్లో ప్రతిభ కనబర్చిన 275 మంది అధికారులకు అవార్డులు పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
అనంతరం రాష్ట్ర ప్రగతిని సూచిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 16 శకటాలను ప్రదర్శించగా డీఆర్‌డీఏ – రైజ్ కేంద్రం శకటం ప్రథమ బహుమతి సాధించింది. రెండో స్థానంలో వ్యవసాయ వాణిజ్య శకటం, మూడో స్థానంలో ఉద్యాన, ఏపీ సూక్ష్మ సేద్య పథకం, పశు సంవర్థక శాఖ శకటం నిలిచాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పంద్రాగస్టు వేడుకల్లో విజయ్ మాస్టర్ ఆధ్వర్యంలో కర్ర, కత్తి సాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీచైతన్య స్కూల్, ఏకేటీపీ స్కూల్ ఆధ్వర్యంలో చక్‌దే ఇండియా, జయహో అమరావతి పాటలకు చిన్నారులు వేసిన నృత్యాలు, చేగు స్కూల్ ఆధ్వర్యంలో బాస్కెట్ బాల్‌తో పవర్ ఆఫ్ రిథమ్ కార్యక్రమం అలరించింది. పోలీసు శాఖ ప్రదర్శించిన డేర్ డెవిల్ పోలీస్ బైక్ స్టంట్స్ ఔరా అనిపించాయి. డ్రైవర్ లేకుండా పోలీసు జీపును నడపడంతో పాటు జీపు వెనుక నిచ్చెన కట్టి పైకి ఎక్కడం, బైకులపై పోలీసులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
275 మందికి ప్రతిభా ప్రశంసాపత్రాలు అందజేత
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 275 మందికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రతిభా ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ శాఖల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పీ4 కార్యక్రమ మార్గదర్శులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా, కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ప్రతిభా ప్రశంసా పత్రాలు అందజేశారు.


