ఈ ప్రశ్నలకు బదులేది..? | - | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నలకు బదులేది..?

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులు దాటింది

నేటికీ సాయికృష్ణ తల్లికి బూడిద కూడా దక్కని వైనం ఎప్పుడు చనిపోయాడో తెలియకుండానే కర్మకాండలు సిట్‌ ఏర్పాటు చేసి రెండు నెలలైనా ఆరుగురి అరెస్టులతో సరి ఇప్పటికీ ముందడుగు పడని వైనం

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యమై వందరోజులు దాటింది. నా కొడుకు మృతదేహాన్ని ఏం చేశారు... కనీసం ఆ బూడిదైనా ఇవ్వండంటూ సాయికృష్ణ తల్లి నెత్తీ...నోరూ మొత్తుకున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఏదో కన్నీళ్లు తుడవటానికంటూ సిట్‌ వేసి చేతులు దులుపుకొంది. సిట్‌ వేసి రెండు నెలలు గడిచినా విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేవలం సీఐ నాగరాజు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అరెస్టు చేయడం వరకే పరిమితం అయింది తప్ప కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.
సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులు దాటింది

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యమై వంద రోజులైంది. ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం ఏమైందో, ఎక్కడ దహనం చేశారో, బూడిద కూడా ఏం చేశారో పరమ రహస్యంగానే ఉంది. రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజుని, నలుగురు కానిస్టేబుళ్లను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని వేర్వేరుగా ప్రశ్నించినా ఇప్పటివరకూ ఏం తేల్చలేకపోయారు. అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఏ కేసులో తీసుకు వచ్చారు. వారెంట్‌ పెండింగ్‌ ఉంటే కోర్టులో హాజరుపర్చకుండా, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు అప్పగించారు. అక్కడే ఉంచి విచారించారా.. లేక మరేదైనా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారా.. సాయికృష్ణ ఎప్పుడు(లాకప్‌డెత్‌) మరణించాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ఏం చేశారో ఇప్పటికీ తేల్చలేదు. బైక్‌పై డెడ్‌బాడీని తీసుకెళ్లి స్వర్గపురిలో దహనం చేసినట్లు వస్తున్న వార్తలు నిజమేనా.. స్వర్గపురిలో ఏమి ఆధారాలు సేకరించారన్న సమాచారంపై స్పష్టత రాలేదు. సాయికృష్ణ కాలిగోళ్లు పీకడం కోసం ఉపయోగించిన ఆర్‌ఎంపీ ఇప్పటివరకూ ఎంతమందికి ఈ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అసలు పోలీసు స్టేషన్‌లో ఆర్‌ఎంపీకి ఏం పని అనే విషయంపై కూడా సిట్‌ దృష్టి పెట్టలేదు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్‌లోని మరో సీఐ సహకరించారన్న వార్తలపై... ఆ సీఐ ఎవరు అన్నది గుర్తించారా? గుర్తిస్తే ఇప్పటి వరకూ ఆ సీఐని ఎందుకు ప్రశ్నించలేదు అన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement