మృత్యువులోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహం

Aug 17 2026 7:29 AM | Updated on Aug 17 2026 7:29 AM

● ఒకే వీధికి చెందిన ముగ్గురు యువకుల మృత్యువాత ● ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి ● కృష్ణలంకలో విషాద ఛాయలు

కృష్ణలంక(విజయవాడతూర్పు): వారి స్నేహాన్ని చూసి మృత్యువుకు కన్నుకుట్టిందో ఏమో.. వారి ప్రణాలను బలిగొంది. అయితే వారి స్నేహాన్ని మాత్రం ఓడించలేకపోయింది. తీగుళ్ల తేజేష్‌, వీశం గౌతమ్‌, గడ్డం జాషువా స్నేహితులు. వారంతా కృష్ణ లంకలోని ద్వారకానగర్‌ మొదటిలైన్‌కు చెందిన వారే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడంతో మధ్యాహ్నం వరకూ ఇళ్ల వద్దే ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తేజేష్‌, గౌతమ్‌, జాషువా, తేజ, కృష్ణ, ప్రేమ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పార్క్‌కు వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి బయటకు వచ్చారు. పార్కుకు కాకుండా ఈత కొట్టేందుకు సమీపంలోని పద్మావతి ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో దిగి మధ్యలో ఉన్న పాయలోకి వెళ్లారు. గౌతమ్‌, తేజేష్‌, జాషువా తేజ ఈత కొట్టేందుకు నదిలో దిగగా, కృష్ణ, ప్రేమ్‌ ఒడ్డునే ఉన్నారు. తేజ లోతు ఎక్కువ ఉందని ఒడ్డుకు వచ్చేశాడు. ఇంతలో గౌతమ్‌, తేజేష్‌, జాషువా నీట మునిగి పోతున్నామని కేకలు వేశారు. ఈ విషయాన్ని కృష్ణ, ప్రేమ్‌ వెంటనే స్థానికులకు ఫోన్‌ చేసి చెప్పారు. స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు వెళ్లే సరికి వారు ముగ్గురు నీటమునిగి ప్రాణాలు విడిచారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చగా, విగత జీవులుగా ఉన్న తమ బిడ్డలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు అవిసేలా విలపించారు.

ఒకే ఇంట్లో ఇద్దరు మృతి

వీశం గౌతమ్‌, గడ్డం జాషువా ఒకే కుటుంబానికి చెందిన వారు. జాషువా తండ్రి నాగేశ్వరరావు ఏడాది కిందట మృతి చెందాడు. కృష్ణలంకలోని మేనమామ వీసం నరసింహారావు ఇంటి వద్ద తల్లితో కలిసి జాషువా ఉంటున్నాడు. ఇంటర్‌పూర్తి చేసిన అతను స్క్రాప్‌ దుకాణంలో పనికి వెళ్తున్నాడు. శనివారం సాయంత్రం మేనమామ కుమా రులు గౌతమ్‌, తేజతో కలిసి జాషువా కృష్ణానదిలో ఈతకు వెళ్లాడు. గౌతమ్‌, జాషువా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన తీగుళ్ల తేజేష్‌ ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాడు. అతని తండ్రి శ్రీకాంత్‌ రణదీవెనగర్‌ కరకట్టపై ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్‌ చేస్తుంటారు. శ్రీకాంత్‌కు ఇద్దరు కుమారులు కాగా తేజేష్‌ పెద్ద కొడుకు. కృష్ణానదిలో ఇసుక తిన్నెలపై విగతజీవులుగా పడి ఉన్న తమ బిడ్డలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఏడాది కిందట భర్తను, ఇప్పుడు బిడ్డను కోల్పోయిన జాషువా తల్లి అంజలి రోదిస్తున్న తీరు చూపరులను కంటితడి పెట్టించింది. మరో వైపు ఆమె సోదరుడి కుమారుడు గౌతమ్‌ కూడా మృతి చెందడంతో వారి ఇంట మరింత విషాదాన్ని నింపింది.

తేజేష్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న

తండ్రి శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement