గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన త్యాగాల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్–2047 లక్ష్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వర్ణాంధ్ర –2047 విజన్‌కు అనుగుణంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పాలన, పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర రంగాల కీలక ప్రగతి సూచికల్లో మంచి పురోగతి సాధించామన్నారు. ఈ స్ఫూర్తితో మరింత పురోగతికి కలిసికట్లుగా కృషిచేద్దామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకల్లో
కలెక్టర్ లక్ష్మీశ


