కన్నూమిన్ను కానకొండ | - | Sakshi
Sakshi News home page

కన్నూమిన్ను కానకొండ

Aug 12 2026 3:22 AM | Updated on Aug 12 2026 3:22 AM

కన్నూమిన్ను కానకొండ

భద్రతా ప్రమాణాలు పాటించకపోవటంతో మృత్యువాత పడుతున్న కార్మికులు రెండేళ్ల కాలంలోనే 16 మంది మృతి, మరో 67 మందికి పైగా తీవ్రగాయాలు వర్షాకాలంలో క్వారీల్లో తవ్వకాలను నిలిపి వేయాలన్న ఆదేశాలు బేఖాతరు

నిబంధనలకు పాతర

దొనబండ క్వారీలో విచ్చలవిడిగా తవ్వకాలు

కంచికచర్ల: రాతి క్వారీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతబట్టుకుని వస్తున్న కార్మికుల ప్రాణాలు రాళ్ల కింద నలిగిపోతున్నాయి. క్వారీ నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించకపోవ టంతో బడుగు జీవుల ప్రాణాలకు రక్షణ కరువైంది. ముఖ్యంగా వర్షాకాలంలో క్వారీల్లో పనులు నిలిపివేయాలన్న మైనింగ్‌ శాఖ ఆదేశాలను క్వారీ నిర్వాహకులు అమలుచేయడం లేదు. కనీసం సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా కార్మికులతో వెట్టి చాకిరీ చేయించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండలో సర్వే నంబర్‌ 801లో సుమారు 607 హెక్టార్లలో 108 క్వారీలు తవ్వకాలు సాగిస్తున్నాయి. ఈ క్వారీలకు సమీపంలో 32 పైచిలుకు స్టోన్‌ క్రషర్లు ఉన్నాయి. వాటిలో 12 వరకు మూతపడగా, మిగిలినవి పని చేస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు కొంత మంది రాతి క్వారీలను నిర్వహిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ విషయం మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్వారీల్లో ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూలీలు వలస వచ్చి పనిచేస్తారు. శ్రీకాకుళం, యానాం నుంచి కూడా బతుకు తెరువు కోసం కార్మి కులు వచ్చి తవ్వకం పనులు చేస్తారు. మెటల్‌ క్వారీ, క్రషర్లలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది.

క్వారీల్లో మృత్యుఘోష

దొనబండ రాతి క్వారీలు, క్రషర్లలో ఎక్కువగా వర్షాకాలంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో క్వారీల్లో జరిగిన ప్రమాదాల్లో 16 మంది మృతి చెందగా మరో 67 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్రషర్లలో మరో ముగ్గురు మృతిచెందారు. ఇవన్నీ అధికారుల దృష్టికి వచ్చిన మరణాలు. అధికారుల దృష్టికి రాకుండా మృతుల కుటుంబాలకు ఎంతోకొంత ముట్టజెప్పిన ఘటనలు సైతం ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. తాజాగా ఈ నెల ఎనిమిదో తేదీన వర్‌ుచ్య క్వారీలో జేసీబీ కోసం డీజిల్‌ తీసుకెళ్తుండగా క్రాంప్‌ వాహనం పల్టీకొట్టి డ్రైవర్‌ అబ్బూరి రాంబాబు మృతిచెందాడు. గత ఏడాది జూలైలో ఒకేసారి ముగ్గురు కార్మికులు బండరాళ్లకింద పడి మృతిచెందారు. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్‌ గ్రానైట్‌ మెటల్‌ వర్క్స్‌ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన కుమారి బోలీ బండరాళ్లను పగుల కొట్టేందుకు డ్రిల్లింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా పెద్దపెద్ద బండరాళ్లు దొర్లిపడ్డాయి. ఒడిశాకు చెందిన బీబీ నాయక్‌ (40), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాందేవ్‌(30), జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు(19) ఆ బండరాళ్ల కింద నలిగి మృతిచెందారు. మరో ఘటనలో ఓ మహిళ ఇద్దరు చిన్నారులతో క్వారీ గోతిలో దుస్తులు ఉతి కేందుకు వెళ్లింది. ఆ చిన్నారులు నీటిలో పడి మృతి చెందారు. ఇటీవల వర్షంలో కొండపై పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బుద్ద కొండపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ క్రషర్‌లో డ్రైవర్‌ టిప్పర్‌ను రివర్స్‌ చేస్తున్న క్రమంలో ఆ వాహనం క్లీనర్‌పైకి దూసుకెళ్లి అతని ప్రాణాలను బలిగొంది. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు క్వారీ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా చిన్న మొత్తంలో ముట్టజెప్పి పోలీసు కేసులు కాకుండా చేతులు దులుపుకొంటున్నారు.

క్వారీ నిర్వాహకులు భద్రత ప్రమాణాలు పాటించకపోవటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుభవజ్ఞులైన కార్మికులకు ఎక్కువ మొత్తం ఇవ్వాల్సి వస్తుందని పని తెలియని కార్మికులతో తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు అమర్చి పెద్ద పెద్ద బండరాళ్లను బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. బ్లాస్టింగ్‌ సమయంలో బెంచీలు ఏర్పాటు చేయాలి. పెద్ద తాళ్లు కూడా అందుబాటులో ఉంచాలి. వర్షాకాలంలో క్వారీల్లో పనులు నిలిపివేయాలి. అయితే ఈ నిబంధనలను క్వారీ నిర్వాహకులు పాటించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement