స్కామ్ వెనక పసుపులేటి అంకుశం పక్కా ప్లానింగ్ మాషా అల్లాహ్ పేరిట కోట్ల రూపాయల స్కాం ఒకదానికి ఒకటి పొంతన లేని వ్యాపారాలతో ఎర ప్రజల నుంచి దోచిన సొమ్ముతో విచ్చలవిడిగా జల్సాలు
సాక్షి, విజయవాడ: మాషా అల్లాహ్ పేరిట పక్కా ప్లానింగ్‌తోనే పసుపులేటి అంకుశం మోసాలకు పాల్పడ్డాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సత్యనారాయణపురం కేంద్రంగా రూ.100 కోట్ల మేర దండుకుని ఆ తరువాత కంపెనీని మూసివేసిన విషయం విదితమే. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు తమ నుంచి రూ.కోట్ల వసూలు చేసి ఉడాయించిన పసుపులేటి అంకుశం నుంచి డబ్బులిప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం సాయంత్రం నాటికి 630 మందికి పైగా బాధితులు ఫిర్యాదులు చేసినట్లు సమచారం. బాధితులు విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు హాజరై తమకు న్యాయం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు మోసపోయారు. ఇంత డబ్బులు ఇస్తా అంటే నమ్మారు? కేసు నమోదు చేశారు కదా.. చూద్దాం’ అంటూ కలెక్టర్ చెప్పడంతో బాధితులు తిరుగుముఖం పట్టారు. కలెక్టర్ నుంచి ఆశించిన మేర భరోసా లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
భార్యతో కలిసి బీచ్‌లో రీల్స్..
మాషా అల్లాహ్ సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం ఏజెంట్లు, కస్టమర్ల నుంచి డబ్బులతో జల్సాలు చేశాడు. భార్యతో కలిసి బీచ్‌లో స్టెప్పులు వేస్తూ రీల్స్ చేశాడు. బీర్ బాటిల్ చేతపట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో కలిసి బీరు తాగుతూ విలాసంగా గడిపేవాడు. వీటన్నింటినీ రీల్స్ చేసి సుమ అంకుశం (ఇన్‌స్టా ఐడీ) పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కార్యాలయంలో పని చేసే సిబ్బందిని సైతం ట్రిప్పులకు తీసుకెళ్లాడు. నిన్న మొన్నటి వరకు తమకు డబ్బులు చెల్లించాలంటూ బాధితులు పంపించిన వాట్సాప్ మెస్సేజులు చూసిన అంకుశం పరారీలో ఉన్నాడని, వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.
జీఎస్టీ క్లెయిమ్ చేసి.. రూ.కోట్లు కాజేసి..
సత్యనారాయణపురంలోని ఓ నాలుగు అంతస్తుల భవంతిని పసుపులేటి అంకుశం అద్దెకు తీసుకుని మాషా అల్లాహ్ సంస్థను ప్రారంభించాడు. ఇక్కడి నుంచే కార్యకలాపాలన్నీ నడిపించాడు. సంస్థ సిబ్బందికి కూడా అనుమానం రాకుండా తన ఫ్యామిలీ చిత్తూరులో ఉందని నమ్మించాడు. మాషా అల్లాహ్ సంస్థ పేరిట జీఎస్టీ క్లెయిమ్ చేసుకున్నాడు. ముందు నుంచే ఎక్కడా తన వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. సంస్థలో ఎక్కువ మందిని చేర్పించిన వారికి గోల్డ్ కాయిన్ ఆఫర్ అంటూ తాయిలాలు ఎరచూపాడు. సోషల్ మీడియాలో ఏజెంట్ల ద్వారా తన బిజినెస్‌ను ప్రమోట్ చేసుకున్నాడు. స్కీమ్–1 నుంచి 4 వరకు స్క్రబ్, గ్రీన్ ప్యాడ్ మిషన్, సోనాలి రకం నాటుకోళ్ల పెంపకం, వాల్‌నట్స్ బిజినెస్ అంటూ ఒకదానికి ఒకటి పొంతన లేని వ్యాపారాలు ప్రారంభించాడు. ఏ బిజినెస్ అయినా ముందు రూ.30 వేలు, తరువాత రూ.లక్ష డిపాజిట్ కట్టాలని షరతు విధిస్తాడు. ఏజెంట్లు సైతం గుడ్డిగా నమ్మి... వారు కట్టడమే కాకుండా మరి కొంత మందితో డబ్బులు కట్టించారు.


