రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ ఏకే నాగసుధీర్ విధుల్లో నిజా యితీ చాటుకున్నారు. రైలులో ప్రయాణికుడు మర్చిపోయిన రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును గుర్తించి ఆర్‌పీఎఫ్ అధికారులకు అందజేశారు. టీటీఐ నాగసుధీర్ మంగళవారం విశాఖపట్నం – బెంగళూరు (18510) ఎక్స్‌ప్రెస్‌లో రేణిగుంట నుంచి విజయవాడ వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బి–1 కోచ్ లోని బెర్త్ నంబర్–58లో ఒక గుర్తు తెలి యని బ్యాగును గుర్తించారు. దీనిపై తోటి ప్రయాణికులను విచారించడం ద్వారా ఆ బెర్త్‌లోని ప్రయాణికుడు ఒంగోలు స్టేషన్‌లో దిగిపోయినట్లు తెలుసుకున్నారు. ఆ బ్యాగును తెరచి చూడగా అందులో సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు ఉన్నాయి. అంతట బ్యాగును భద్రపరిచి దాన్ని సరైన యజమానికి అప్పగించేందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఆర్‌పీఎఫ్ అధికారులకు అందజేశారు. దీనిపై విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం ప్రశాంత కుమార్ స్పందిస్తూ ఇటువంటి నిజాయితీ చర్యలు భారతీయ రైల్వే విశ్వసనీయతకు నిదర్శనంగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.


