పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసిన శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.1.24 కోట్లకు పైగా నగదును కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. కానుకలను అమ్మవారి మండపంలో మంగళవారం లెక్కించారు. 73 రోజులకు గాను ఆలయంలోని అన్ని హుండీల ద్వారా రూ.1,24,23,463 నగదు, మిశ్రమ బంగారం 34.100 గ్రాములు, వెండి 520.090 గ్రాములు సమకూరాయని ఆలయ ఈఓ జి.వి.డి.ఎన్.లీలాకుమార్ పేర్కొన్నారు. విదేశీ నగదు కూడా వచ్చిందని వివరించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓ, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు, జిల్లా దేవదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ శెట్టి పర్యవేక్షించారు.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన యూజీ నాలుగో సెమిస్టర్ రీ– వాల్యూయేషన్, పీజి ఒకటో సెమిస్టర్ రీ – వాల్యూయేషన్, బీటెక్ ఆరో సెమిస్టర్ రీ – వాల్యూయేషన్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఉపకులపతి ఆచార్య కూన రాంజీ ఈ ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. విద్యార్థులు ఈ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని సూచించారు.
వీరులపాడు: రైల్వేలైన్ కోసం భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని జుజ్జూరు, పొన్న వరం గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. జుజ్జూరు శివారులో రైల్వే లైన్‌కు భూములు కోల్పోతున్న రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్‌కు 175 ఎకరాలు అవసరమని, రైతుల నుంచి 166 ఎకరాలు సేకరిస్తామని, తొమ్మిదెకరాల ప్రభుత్వ భూమి ఉందని వివరించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆకాంక్ష మేరకు నష్ట పరిహారం ఇస్తామన్నారు. అనంతరం అంగనవాడీ కేంద్రం, ఉర్దూ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు చెప్పటంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పొన్నవరం వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఆర్డీఓ అనిల్‌కుమార్, తహసీల్దార్ రవికుమార్, వ్యవసాయ శాఖ ఏఓ జోగేంద్ర ప్రసాద్, డెప్యూటీ తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, లీప్ యాప్ డౌన్‌లోడ్ విషయంలో క్షేత్ర, జిల్లా, మండలస్థాయి అధికారులు ఒత్తిడి తీసుకురావడం ఆందోళనకరమని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయిశ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు నుంచి పదో తరగతుల విద్యార్థులు నిత్యం 100 శాతం పాఠశాలకు హాజరు కావాలని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌లో లీప్ యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయించాలని క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు. లక్ష్యాలు పూర్తికాకపోతే ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరించడం వల్ల ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు.
ఆ బాధ్యత ఉపాధ్యాయులదా?
రాష్ట్రంలోని అనేక గ్రామీణ, గిరిజన, వెనుక బడిన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రతి కుటుంబానికి స్మార్ట్‌ఫోన్ లేదని, కొన్ని కుటుంబాల్లో ఒకే ఫోన్‌ను పలువురు ఉపయోగిస్తున్నారని, అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సక్రమంగా లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో 100 శాతం లీప్ యాప్ డౌన్‌లోడ్ చేయించడం ఉపాధ్యాయుల చేతుల్లో లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల వద్ద స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఉపాధ్యాయులు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు.


