లోకేష్‌ రాజీనామా కోసం పట్టు | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ రాజీనామా కోసం పట్టు

Aug 11 2026 1:54 AM | Updated on Aug 11 2026 1:54 AM

లోకేష్‌ రాజీనామా కోసం పట్టు

జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు ఆంక్షలు ఎన్ని ఉన్నా, అడ్డంకులు సృష్టించినా ముందుకే..

పెనమలూరు నియోజకవర్గంలో సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో కంకిపాడు సెంటర్లో డీఎస్సీ అక్రమాలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కానూరు గ్రామం నుంచి మోటార్‌ బైక్‌లతో ర్యాలీగా కంకిపాడు ప్రభుత్వాస్పత్రి సెంటరు వరకు చేరుకున్నారు. అనంతరం కంకిపాడు సీఐ రవికుమార్‌ ఇతర సిబ్బంది ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు. రోప్‌ల సహాయంతో నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు.

గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభం కాగా కొద్దిసేపటికి భారీ ఎత్తున తరలివచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

విజయవాడ ‘పశ్చిమ’లో సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి రామమందిరం సెంటర్‌, కొత్తగుళ్లు, శేషయ్య వీధి, సామారంగచౌక్‌ సెంటర్‌, రమణయ్య కూల్‌డ్రింక్‌ షాపు సెంటర్‌ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి కార్యాలయానికి చేరుకుంది. పార్టీ ముందుగా కోరిన రూట్‌ ప్రకారం అనుమతులు ఇవ్వకపోవటంతో వేరే రూట్‌లో ర్యాలీ చేశారు. పెద్ద సంఖ్యలో యువత, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆసిఫ్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మైలవరం నియోజకవర్గం స్థాయి నిరసన ర్యాలీని జి.కొండూరులో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఐదు మండలాల నుంచి పార్టీ శ్రేణులు జి.కొండూరు వై.జంక్షన్‌ బైపాస్‌ నుంచి జి.కొండూరు గ్రామంలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.

తిరువూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి స్వామిదాసుకు, తిరువూరు జెడ్పీటీసీ యరమల రామచంద్రారెడ్డికి పోలీసులు ర్యాలీ నిర్వహించవద్దని నోటీసులు ఇచ్చినా వారు ఖాతరు చేయకుండా ర్యాలీ చేశారు. తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్‌ నుంచి చీరాల సెంటర్‌ వరకు ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నందిగామ నియోజకవర్గ కేంద్రం నందిగామలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు ఆధ్వర్యాన డీఎస్సీ అక్రమాలపై విచారణ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని నిరసన తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు కారకుడైన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిరసన ర్యాలీ చేశారు. నందిగామ గాంధీ సెంటరు నుంచి మున్సిపల్‌ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌, సీఎం రోడ్డు, రైతుపేట మీదుగా కోర్టు రోడ్డు, ఆర్డీవో కార్యాలయం, గాంధీ సెంటరు, రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నుంచి తిరిగి గాంధీ సెంటరు వరకు సుమారు 3.5 కి.మీల మేర ర్యాలీ జరిగింది.

విజయవాడ ‘సెంట్రల్‌’లో సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యాన ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రభ కాలనీలోని మల్లాది విష్ణు కార్యాలయం నుంచి పైపుల రోడ్డు మీదుగా కండ్రికలోని మహానేత విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. పోలీసు కమిషనర్‌కు రూట్‌ మ్యాప్‌ పంపారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు.. సమన్వయకర్త మల్లాది విష్ణుకు నోటీసులు ఇచ్చారు. అప్పటికే ఆయన కార్యాలయం పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పార్టీ కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కార్యకర్తలను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కనీసం పార్టీ కార్యాలయంలోకి వెళ్లనీయరా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వారందరినీ పార్టీ కార్యాలయం రోడ్డులోకి పంపించి ఆ దారిని పోలీసులు బారి కేడ్లతో బ్లాక్‌ చేశారు. అక్కడ నుంచి ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి మెయిన్‌ రోడ్డు వరకు వచ్చి అక్కడ బైఠాయించి పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. పోలీసులు.. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులను అక్కడ నుంచి కదలకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలు రోడ్డు మీద కూర్చుని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీజీఆర్‌ సుధాకర్‌బాబు, పరిశీలకుడు గౌస్‌ మొహిద్దీన్‌, మాజీ డెప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజ, మాజీ కార్పొరేటర్లు జానారెడ్డి, ఈతరపు దేవి, కుక్కల అనిత, పార్టీ నాయకులు గుండె సుందరపాల్‌, శ్రీనివాసరెడ్డి, పార్టీ క్లస్టర్ల అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

నందిగామ గాంధీ సెంటర్‌లో మహాత్ముని విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహనరావు, యువత

ఆంధ్రప్రభకాలనీలోని వైఎస్సార్‌ సీపీ ఆఫీస్‌ వద్ద నిరసన తెలుపుతున్న

మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, సుధాకర్‌ బాబు, విద్యార్థి సంఘ నేత రవిచంద్ర తదితరులు

వన్‌టౌన్‌లో పశ్చిమ ఇన్‌చార్జ్‌ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్‌ భాగ్యలక్ష్మి, యువత

సాక్షి ప్రతినిధి, విజయవాడ: డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ర్యాలీలు జరిగాయి. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా యువత, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. అక్రమాలు జరగకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో చెప్పాలని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆదివారమే దేవినేని అవినాష్‌కు నోటీసులు అందజేశారు. సోమవారం ఉదయం అవినాష్‌ ఇంటి సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇంటి నుంచి ర్యాలీకి బయలు దేరితే అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, యువతకు సమాచారం అందడంతో అందరూ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, యువజన విబాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల్‌సాయి, సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబు, పార్లమెంటు కార్యదర్శులు ఆళ్ల చెల్లారావు, సర్నాల తిరుపతిరావు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షుడు సయ్యద్‌ అలీం, చందా కిరణ్‌తేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement