మూడు విభాగాల్లో ఎంపిక చేసిన జ్యూరీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు ఫొటోగ్రాఫర్ల నుంచి విశేష స్పందన లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ పోటీలకు మొత్తం 221 ఛాయాచిత్రాలు ఎంట్రీలు పంపగా, వాటిలో మూడు కేటగిరీలకు సంబంధించిన 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సోమవారం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్‌లోని జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో ప్రదర్శించిన ఛాయాచిత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటగిరీల వారీగా పరిశీలించిన జ్యూరీ సభ్యులు ప్రతిభ, సృజనాత్మకత, అంశ ప్రాధాన్యం, ఛాయాచిత్ర నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 27 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేశారని తెలిపారు. విశేష అనుభవం కలిగిన ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ టి.శ్రీనివాస రెడ్డి, ఎఫ్‌ఆర్‌పీఎస్ ది హిందూ రిటైర్డ్ ఫొటో జర్నలిస్ట్ సి.హెచ్.వి.ఎస్. విజయభాస్కరరావు, విజయవాడ స్టూడియో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవికుమార్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఎస్.రామారావు (ఫ్లాష్ రామారావు), డీపీఆర్వో టి.నాగేశ్వరరావు, వీఎంసీ పీఆర్వో డాక్టర్ రజియా షబీనాలు జ్యూరీగా వ్యవహరించారన్నారు. నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను ఆగస్టు 19న అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో కె.వి.రమణరావు, డివిజనల్ పీఆర్వో కె.రవి, రిటైర్డ్ ఏవీ సూపర్‌వైజర్ వీవీ ప్రసాద్, ఏవీ సూపర్‌వైజర్ బి.బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు.


