లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వాస్పత్రుల్లో సోమవారం జూనియర్ వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తమకు స్టైపెండ్ పెంచే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. రెండేళ్లకు ఒకసారి జూడాలకు స్టైపెండ్ పెంచాల్సి ఉంది. అందులో భాగంగా గతేడాది డిసెంబరులో పెంచాల్సి ఉండగా, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో వైద్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ స్టైపెండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఉంటే అన్నిప్రభుత్వ వైద్య కళాశాలలు, భోదనాస్పత్రిల్లో సమ్మెకు దిగనున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు ఆధార్ సేవలను వేగంగా అందించడానికి ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలను నిర్వహించనున్నట్లు వివరించారు. శిబిరాలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు, ఆ తర్వాత 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయన్నారు. వీటిలో కొత్త ఆధార్ నమోదు, పేరును సరిచేయడం, నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాల అప్డేషన్ చేస్తారని తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నారు. ఆధార్ వివరాలను సక్రమంగా, తాజా సమాచారంతో ఉండటం ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఇతర సేవలను పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
భవానీపురం (విజయవాడ పశ్చిమ): గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, నృత్యరీతులను పరిరక్షించడంతోపాటు గిరిజన విద్యార్థుల విద్య, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సమప్రాధాన్యమిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యాన సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్, ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇందులో గిరిజన కళాకారులు సంప్రదాయ నృత్యాలు, కళారూపాలు ప్రదర్శించారు. అనంతరం మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని, అవసరమైనవి అందజేస్తున్నామన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా ఆకర్షణీయమైన శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని, శకటాలకు సంబంధించిన డిజిటల్ నోట్స్‌ను సీపీఓకు వెంటనే పంపాలని సూచించారు. ఆగస్టు 14, 15 తేదీల్లో అన్ని ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో త్రివర్ణ దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో లక్ష్మీనరసింహం వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


