అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె ఎండీ అఫీఫా మృతదేహం వద్ద మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫారూఖ్, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సోమవారం నివాళులర్పించారు. చీరాల బీచ్‌కు స్నేహితులతో కారులో వెళ్తుండగా గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద లారీ, కారు ఢీకొన్న ఘటనలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె మహ్మద్ అఫీఫా(24) ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. షిరీన్‌బేగం, మస్తాన్ దంపతులకు కుమారుడు రెహాన్, కుమార్తె అఫీఫా సంతానం. అఫీఫా ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో ఎంఏ సైకాలజీ చేస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుంది. అఫీఫా మరణవార్తను జీర్ణించుకోలేక డీసీపీ షీరీన్‌బేగం గుండెలవిసేలా రోదిస్తున్నారు. కుమార్తె జ్ఞాపకాలను తలుచుకుంటూ.. ఆమె భౌతికకాయాన్ని చూస్తూ పలుమార్లు కుప్పకూలి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. అఫీఫా భౌతికకాయాన్ని విజయవాడ న్యూఆర్‌ఆర్‌పేటలోని స్వగృహానికి ఆదివారం రాత్రి తీసుకువచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫారూఖ్, రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా, కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మేయర్, డెప్యూటీ మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, అవుతు శ్రీశైలజతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు అఫీఫా మృతదేహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. డీసీపీ షీరీన్‌బేగం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ టాకీస్ వద్ద ఉన్న కబర్‌స్తాన్‌లో ముస్లిం సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
విజయవాడలీగల్: విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్రంలో సంచలనం కలిగించిన విషయం విదితమే. ఈ కేసులో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఏసీపీ ఎం.మానసను ప్రతివాదులుగా చేర్చి, వారిని విచారించాలని కోరుతూ పార్లమెంట్ సభ్యుడు మద్దిల గురుమూర్తి విజయవాడలోని 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఆయన తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒగ్గు గవాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. సోమవారం న్యాయవాది గవాస్కర్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఈ కేసులో వ్యక్తిని కనిపించకుండా చేయడమే కాకుండా, అతని తల్లికి బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితిలో కేసు విచారణ సాగుతోందన్నారు.
17వ తేదీకి వాయిదా
మాజీ సీఐ నాగరాజుతోపాటు డీజీపీ, సీపీ, ఏసీపీ కూడా నిందితులేనని, సాక్ష్యాలు తారుమారు చేశారని, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 2026 మే 28వ తేదీన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, పిన్ని కనకదుర్గ కలసి ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా సమాచారం తెలియపర్చినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, సాక్ష్యాధారాల ద్వారా న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. డీజీపీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎంపీ గురుమూర్తికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, పిటీషన్ విచారణకు అర్హత లేదని వాదించారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ వాదనలు వినిపిస్తూ ఆర్టికల్ 21కు విరుద్ధంగా కేసు ఉందని స్పష్టంచేశారు. ఇలాంటి కేసుల్లో ఎవరైనా పిటీషన్ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కేసులో ఎంపీ గురుమూర్తి పిటీషన్ దాఖలు చేసే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఈ కేసు సభ్యసమాజానికి సంబంధించిన విషయమని, సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను న్యాయమూర్తికి దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటీషన్‌ను ఎంపీ గురుమూర్తి స్వయంగా న్యాయస్థానంలో హాజరు కావాలని, ఆయన సాక్ష్యాన్ని రికార్డు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి ఎస్.శ్రీకాంత్ ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. దీంతో సాక్ష్యం రికార్డు అయిన పిదప న్యాయస్థానం అనుమతిస్తే డీజీపీ, సీపీ, ఏసీపీలు నిందితులుగా చేరే అవకాశముంది.
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ నీటిని అధికారులు డెల్టాలోని కృష్ణా, తూర్పు ప్రధాన కాలువలతో పాటుగా గుంటూరు ప్రధాన కాలువలకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి సామర్థ్యం 12 అడుగులు కాగా ప్రస్తుతం 11.9 అడుగులు ఉంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా పంట పొలాలకు వదిలేస్తున్నారు. బ్యారేజీ నీటి సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.04 టీఎంసీలుగా ఉంది. బ్యారేజీ సామర్థ్యానికి 99.25 శాతం నీరు చేరినట్లుగా అధికారులు తెలిపారు. ప్రధానంగా ఎగువన వస్తున్న నీటితో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతోందన్నారు.


