జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట మండలం, గండ్రాయి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు అమరబోయిన రవి, దుండగుల సత్యనారాయణ తదితరులు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సోమవారం పట్టణంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. వారికి వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి పార్టీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు కనపర్తి నరసింహారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి మట్టా ప్రతాపరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. గండ్రాయి గ్రామ పార్టీ అధ్యక్షుడు దమ్మాలపాటి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట్ల వెంకటరెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే నేను కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలన్నారు. ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో తాను చేయగలిగే ఒక మంచి పనిని లేదా కృషిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖులు తదితరులు తమ దేశభక్తి, దేశ నిర్మాణంపై తమ ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా 30 సెకన్ల ‘అనే నేను’ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తెలిపారు. ‘అనే నేను’’ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటన విడుదల చేశారు.
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికాతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాలు విజయవాడలో సోమవారం జైల్ భరో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ నుంచి గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి స్టేషన్ ఎదుట స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను అరెస్ట్ చేయాలని ఆయా సంఘాలు స్వచ్ఛందంగా పోలీసులను కోరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల భారత్‌లోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమందరావు తదితరులు పాల్గొన్నారు.


