అడ్రస్‌ లేని అంకుశం! | - | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ లేని అంకుశం!

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

అడ్రస్‌ లేని అంకుశం!

10న సెటిల్‌ చేస్తానన్నది వట్టి మాటే మాష్‌ అల్లా సంస్థ యజమానిపై ఇప్పటికే 500 మంది బాధితుల ఫిర్యాదు ముస్లిం మహిళలే టార్గెట్‌గా వసూళ్ల పర్వం తెరవెనుక మంత్రాంగం నడుపుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధి

శనివారం వరకూ పని చేసిన అతని వాట్సాప్‌

500మందికి పైగా..

సాక్షి, విజయవాడ: అంట్లు తోమే స్క్రబ్‌ తయారీ, నాటుకోళ్ల పెంపకం, డ్రై ఫ్రూట్స్‌ బిజినెస్‌ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని కోట్ల రూపాయలు వసూలు చేసిన మాష్‌ అల్లాహ్‌ యజమాని పసుపులేటి అంకుశం బోర్డు తిప్పేసి, పరారయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 మంది నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన డబ్బులు చెల్లిస్తానని చెప్పిన ఆయన కొన్ని రోజులుగా ఫోన్‌ ఎత్తడం లేదని బాధితులు వాపోతున్నారు. శనివారం రాత్రి వరకు కూడా పసుపులేటి అంకుశం ఫోన్‌ వాట్సాప్‌ పని చేసింది. పోలీసులు మాత్రం అతను కనిపించడం లేదని చెప్పడంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతా ప్లాన్‌ ప్రకారమే..

విజయవాడకు చెందిన మాషా అల్లా ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ నిర్వాహకుడు అంకుశం రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని సోషల్‌ మీడియా ద్వారా భారీగా ప్రచారం చేసుకున్నాడు. ఒకరిని చూసి మరొకరు ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 1800 మంది ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారిలో ఎక్కువ మంది మహిళలే. రూ.30వేలతో మొదలు పెట్టి రూ.3కోట్ల వరకు వసూలు చేశాడు. మొత్తంగా రూ.100 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తోంది.

బాధితుల్లో కడప, కర్నూలు వారే ఎక్కువ..

మాషా అల్లా ఎంటర్‌ ప్రైజెస్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో యాడ్‌ చూసి ఆకర్షణకు లోనై కడప, కర్నూలు వారే ఎక్కువ మంది డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. డబ్బులు కట్టిన వారికి అగ్రిమెంట్‌ ఇస్తాం అని కూడా అంకుశం నమ్మించాడు. కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్‌ ఏకంగా రూ.3.50కోట్ల మేర డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. కర్నూలుకు చెందిన వారు కూడా ఎక్కువగా ఉన్నారు. అంట్లు తోముకునే స్క్రబ్స్‌ తయారీకి మెటీరియల్‌ తామే ఇస్తామని, తయారు చేసిన వాటిని మళ్లీ తామే కొనుగోలు చేస్తామని వారిని నమ్మించారు. దీంతో పెద్దఎత్తున బాధితులు డబ్బులు చెల్లించారు.

అధికార పార్టీ నేతల హస్తం..

సంస్థ ఎండీ అంకుశం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్లుగా చేరిన వారికి మొదటి ఆరు నెలలు పూర్తిగా డబ్బులు ఇచ్చిన అంకుశం వారిలో నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత కోట్ల రూపాయల మేర డబ్బులు చేతికి రాగానే ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు అంకుశంకు కాల్స్‌, మెసేజులు పెట్టడం ప్రారంభించారు. అయితే అంకుశం ఆధార్‌, పాన్‌ కార్డు అన్నీ కూడా నకిలీవని బాధితులు ఆరోపిస్తున్నారు. అతనికి జీఎస్టీ నంబర్‌ ఉండడంతోనే తాము డబ్బులు కట్టామని చెబుతున్నారు. ఆగస్టు 10వ తేదీ అందరికీ డబ్బులు చెల్లిస్తానని చెప్పిన అంకుశం బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

నిన్న, మొన్నటి వరకూ వాట్సాప్‌ చూసిన అంకుశం

డబ్బులు ఇవ్వాలని.. ఎందుకు ఇలా మోసం చేశారని కొందరు అంకుశం ఫోన్‌కు మెసేజులు పెడితే చూస్తున్నాడని.. కానీ రిప్లయ్‌ ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ఫోన్‌ ఆన్‌లోనే ఉన్నా.. అంకుశం పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అయితే తాము ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి ఉందని, తమకు డబ్బులు కట్టిన వారు తమ ఇళ్లపై దాడులు చేసేందుకు వస్తున్నారని పలువురు ఏజెంట్లు వాపోతున్నారు.

మాషా అల్లా ఎంటర్ర్‌పైజెస్‌ సంస్థ నిర్వాహకుడు అంకుశం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. స్క్రబ్‌ తయారీ, నాటుకోళ్ల పెంపకం, డ్రై ఫ్రూట్స్‌ బిజినెస్‌ పేరిట తమను నమ్మించి డబ్బులు కట్టించుకుని మోసం చేశాడంటూ ఆదివారం సాయంత్రం వరకు సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు బాధితులు వస్తూనే ఉన్నారు. మొత్తం 500 మంది ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్‌ పెట్టారు. కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నామని సత్యనారాయణపురం పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement