బూదవాడ(జగ్గయ్యపేట అర్బన్): రాష్ట్రంలో 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆ పార్టీ జగ్గయ్యపేట ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం రాత్రి జగ్గయ్యపేట మండలం, బూదవాడ గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడు తున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం సైదమ్మ భర్త గడ్డం శ్రీనివాసరావు జనసేన పార్టీని వీడి తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు బూడిద నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ మీడియెట్ విద్యార్థి వారణాసి భరధ్వాజ్(16) దుర్మరణం చెందడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో నింపింది. విద్యార్థి దుర్మరణంపై పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక ఐశ్వర్య గ్రాండ్స్‌లో నివాసం ఉంటున్న వారణాసి శ్రీనివాస కుమారస్వామి, సంధ్యారాణి దంపతులకు ఇద్దరు కుమారులు. అర్చకత్వం చేసుకుంటూ కుమారులను చదివించుకుంటున్నారు. చిన్నకుమారుడు వారణాసి భరధ్వాజ్ భవానీపురంలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం ఇబ్రహీంపట్నంకు స్కూటీపై వచ్చిన విద్యార్థి తిరుగు ప్రయాణంలో ఫెర్రీ నుంచి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న టిప్పర్ లారీ రింగ్ సెంటర్‌లో ఢీకొట్టింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని 108 సిబ్బంది హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
యువకుడి నేత్రదానం..
కన్నకుమారుడిని కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. యువకుడి కళ్లను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎల్‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి నేత్రాలు సేకరించారు. తమ విషాదాన్ని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేలా మార్చేందుకు కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురి హృదయాలను కదిలించింది. పోలీసులు యువకుడి పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. పోలీసులు ప్రమాదానికి గురైన లారీని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్. రవివర్మ తెలిపారు.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్):ఖాతాదారుకు డెలివరీ కానీ క్రెడిట్ కార్డు నుంచి రూ.లక్ష మేర సైబర్ నేరస్తులు కొట్టేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీసుల కథనం మేరకు.. నందమూరినగర్ భారతమాత మందిరం రోడ్డులో నివసించే చిట్టినాడ శ్రావణి తన భర్తతో కలిసి శ్రీదేవి డ్రై క్లీనింగ్ షాపు నడుపుతోంది. ఆమెకు ఓ ప్రైవేట్ బ్యాంకు క్రెడిట్ కార్డును 2019 నుంచి వాడుతున్నారు. 2027తో కాల పరిమితి ముగిసే ఆ కార్డు గురించి ఈ ఏడాది జూన్ 30వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు అప్డేట్ చేయాలి, వివరాలు చెప్పాలని కోరారు. అయితే శ్రావణి అందుకు నిరాకరించింది. ఆ తరువాత క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, పుట్టిన సంవత్సరం చెప్పాలని అడగడంతో ఆమె ఆ వివరాలు వెల్లడించింది. ఆ తరువాత ఆ బ్యాంక్ యాప్ సరిగ్గా పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి జూలై 20వ తేదీన టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోను చేసి కార్డుకు బ్లాక్ చేయించింది. బ్లాక్ చేసిన తర్వాత కూడా కార్డు అప్‌డేట్ మెసేజ్ రావడంతో తిరిగి ఆగస్టు రెండో తేదీన మళ్లీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి బ్లాక్ చేయాలని కోరగా, అదే ఐవీఆర్‌ఎస్ కాల్ లోనే కొత్త కార్డు కొరియర్ ద్వారా పంపిస్తామని చెప్పారు. శ్రావణి తనకు కార్డు వద్దని చెప్పినా కొత్త కార్డు జారీ చేసినట్లు ఆమెకు ఒక మెసేజ్ పంపారు. అయితే ఈ నెల ఆరో తేదీన క్రెడిట్ కార్డు నుంచి రూ.1.07,941 మేర వాడినట్లు మెసేజ్ రావడంతో నివ్వెరపోయిన ఆమె అసలు తనకు క్రెడిట్ కార్డు ఇంకా డెలివరీనే కాలేదని, డబ్బులు ఎలా వాడతానని బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించింది. ఈ డబ్బులు మీరే వాడినట్లు చూపుతోందని బ్యాంక్ సిబ్బంది బదులిచ్చారు. దీంతో ఆమె అజిత్‌సింగ్‌నగర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


