గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అందిన ప్రతి క్లెయిమ్, అభ్యంతరాన్ని అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.వి.శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శుక్రవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఏడు నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓలు), వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వర్చువల్‌గా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శేషగిరిబాబు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్, అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రతిరోజూ కనీసం 70 కేసులపై విచారణ చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఓటర్ల ఫొటోతో కలిగిన జాబితాలను వివిధ పార్టీల ప్రతినిధులకు ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ అందజేశారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, మున్సిపల్ కమిషనర్, విజయవాడ సెంట్రల్ ఈఆర్‌ఓ హెచ్.ఎం.ధాన్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.


