డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం అనూహ్యంగా చలసాని చక్రపాణి విత్‌డ్రా డైరెక్టర్‌గా గొంది నరేంద్ర చైర్మన్‌గా ఆంజనేయులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయ డెయిరీ డైరెక్టర్ల ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య ఏకగ్రీవమయ్యాయి. మూడు డైరెక్టర్ల ఖాళీలకు బుధవారం చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబు, చలసాని చక్రపాణి, గొంది నరేంద్రబరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. గడువు ముగియడానికి కచ్చితంగా మూడు నిమిషాలు ఉన్న తరుణంలో అనూహ్యంగా చలసాని చక్రపాణి తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల అధికారి గురునాథంకు తెలిపారు. బరిలో ముగ్గురు అభ్యర్థులే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. చలసాని ఆంజనేయులు, పల్లగాని రాంబాబుకు డిక్లరేషన్ ఫారాలను అందజేశారు. నరేంద్ర ఏకగ్రీవమైనా డిక్లరేషన్ పత్రాన్ని తీసుకునేందుకు అందుబాటులో లేకపోవడంతో అధికార పార్టీ నేతల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలపై ఉత్కంఠ!
నామినేషన్ల దాఖలు చేసిన గొంది నరేంద్రతో నామినేషన్ ఉపసంహరించుకునేలా డెయిరీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించినా చివరి నిముషంలో బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం పాలప్రాజెక్టుకు విచ్చేస్తున్న నరేంద్రను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో తరలించినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నరేంద్రతో నామినేషన్ వేయించి అతనికి మద్దతుగా ఉన్న అధికార పార్టీ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేకు చెందిన వారే అధికార పార్టీ కార్యాలయానికి ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యే కొంతకాలంగా చైర్మన్ చలసాని ఆంజనేయులపై బహిరంగంగా విమర్శలు చేయడం, ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరో వైపున మూడు పోస్టులకు నాలుగురు నామినేషన్ల ఉండటంతో ఎన్నిక అనివ్యారమయ్యేలా కనిపించింది. చివరి నిమిషంలో చలసాని ఆంజనేయులు, బోర్డు డైరెక్టర్లు, తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత చక్రపాణి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వేసిన ఎత్తులు ఫలించలేదు. నామినేషన్ ఉపసంహరణ అనంతరం చక్రపాణి కన్నీటి పర్యంతమయ్యారు.
చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు
ఏకగ్రీవ ఎన్నిక
బోర్డు డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తైన తర్వాత బోర్డు సమావేశమైంది. సమావేశంలో చైర్మన్‌గా చలసాని అంజనేయులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ బోర్డు సభ్యులు తీర్మానించారు.


