చైర్మన్‌ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి! | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి!

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

చైర్మన్‌ రాజీనామాకు మంత్రుల ఒత్తిడి!

కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ డెయిరీ) చైర్మన్‌ చలసాని ఆంజనేయులను రాజీనామా చేయాలని జిల్లా మంత్రులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. విజయ డెయిరీలో గురువారం 3 డైరెక్టర్ల ఖాళీలకు ఎన్నిక ప్రక్రియ జరిగింది. చలసాని ఆంజనేయులతో పాటు మరో ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికవగా, సాయంత్రం జరిగిన బోర్డు సమావేశంలో చైర్మన్‌గా చలసానిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన అర్ధగంటలోనే మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రలు, మరో టీడీపీ నేత విజయ డెయిరీకి చేరుకున్నారు. చైర్మన్‌ చలసాని ఆంజనేయులు చాంబర్‌కు నేరుగా చేరుకున్నమంత్రులు ఆయనను రాజీనామా చేయాలని పట్టుపట్టారు. ఈ దఫా ఎన్నికలలో చలసాని ఆంజనేయులను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకుండా చూడాలని జిల్లా టీడీపీ నేతలు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలించలేదు. విజయ డెయిరీ ఆవరణలోనే నందిగామకు చెందిన బోర్డు డైరెక్టర్‌.. ఎమ్మెల్యేల మధ్య ఫోన్‌లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.

రాజీనామా ప్రసక్తే లేదు..

చైర్మన్‌ చాంబర్‌లో చలసానితో పాటు మంత్రులు సుదీర్ఘంగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఓ దశలో చలసానిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సుమారు రెండు గంటలు చర్చ జరిగిన తర్వాత రాజీనామా చేసే ప్రసక్తి లేదని చలసాని తేల్చిచెప్పారు. ఇంతలో చలసాని మరోసారి అస్వస్థతకు గురవడంతో కుమార్తెతో ఆయన నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తీసుకుంటుందోనని అటు బోర్డు డైరెక్టర్లతో పాటు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ అధికారులు, ఉద్యోగులలో చర్చ జరుగుతోది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement