జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో కమిటీ సభ్యులు బంధిత కార్మిక వ్యవస్థ (నిర్మూలన) చట్టం–1976 నిబంధనలు, అమలు విధానం, బాధితులను గుర్తించే ప్రక్రియ, పునరావాస చర్యలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు.
వ్యత్యాసాన్ని గ్రహించాలి..
కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ వలస కార్మికులు స్వచ్ఛందంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తారని, బంధిత కార్మికులు మాత్రం అప్పులు, బెదిరింపులు, బలవంతం లేదా ఇతర పరిస్థితుల కారణంగా యాజమాన్యానికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితిలో ఉంటారని వివరించారు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారులు స్పష్టంగా గుర్తించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన తర్వాతే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
సమన్వయంతో పనిచేయాలి..
జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యాన్ని సమర్థంగా సాధించగలమని పేర్కొన్నారు. జిల్లా కార్మిక శాఖ అధికారి జి.ధనలక్ష్మి, వాసవ్య మహిళా మండలి సోషల్ వర్కర్ కె.విజయ, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ జామి రమాదేవిలు ఉన్నారు.


