ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా రూపొందించవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ నమోదుపై జిల్లాలోని స్టాటిస్టికల్ అధికారులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్న కలెక్టర్, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మేక స్వాతి మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరించారు.


