కృష్ణా డెల్టాకు సాగు నీరు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

కృష్ణా డెల్టాకు సాగు నీరు విడుదల చేయాలి

Aug 3 2026 4:03 AM | Updated on Aug 3 2026 4:03 AM

గుడివాడటౌన్‌: కృష్ణా డెల్టాకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను తెలంగాణలోని అన్ని లిఫ్ట్‌ స్కీమ్‌ల నుంచి సాగునీటిని విడుదల చేసి వాడుకుంటుంటే ఏపీలో మాత్రం సాగునీటి విడుదల విషయంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం ఉదయానికే జూరాల నుంచి 1.80 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందన్నారు. 1.74 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయాలకు వస్తుందన్నారు. శ్రీశైలం జలాశయంలో కూడా 846 అడుగులకు నీరు చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీరు విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్‌ చేశారు.

జంక్షన్‌ సెంటర్‌లో క్రేన్‌, ఆర్టీసీ బస్సు ఢీ

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: హనుమాన్‌జంక్షన్‌ ప్రధాన కూడలి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూజివీడు రోడ్డు వైపు నుంచి సెంటర్‌కు వస్తున్న క్రేన్‌ను ఏలూరు వెళ్లుతున్న మచిలీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఢీకొట్టడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనటంతో క్రేన్‌ ప్రధాన కూడలి వద్ద పల్టీ కొట్టింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగినప్పుడు క్రేన్‌ పక్కనే ఉన్న ఓ ద్విచక్ర వాహనచోదకుడు సమయస్ఫూర్తితో బైక్‌ వదిలి పరుగులు తీయటంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనతో కూడలిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్‌ స్తంభించింది. జంక్షన్‌ పోలీసులు బొల్తా కొట్టిన క్రేన్‌, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సును సంఘటాస్థలి నుంచి పక్కకు తరలించారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

గుణదల(విజయవాడ తూర్పు): పేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న ఘటన మాచవరం పీఎస్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంజిసర్కిల్‌ ఫ్లైవర్‌ దిగువన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ వ్యానుతో సహా అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో మాచవరం పోలీసులు అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. వ్యానును తనిఖీ చేసి చూడగా రేషన్‌ బియ్యం బస్తాలు ఉన్నాయి. దీంతో సదరు బియ్యం తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్న పీఎస్‌కు తరలించారు. 50బస్తాలు ఉన్న వ్యానును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రేషన్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లయి అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement