లబ్బీపేట(విజయవాడతూర్పు): కొన్నేళ్లుగా సంతాన సాఫల్య చికిత్సలు పొందినా పిల్లలు పుట్టని ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులు ఢిల్లీలో శిశువును అక్రమంగా కొనుగోలు చేశారు. అక్కడి నుంచి శిశువును తీసుకుని సొంతూరుకు వెళ్తున్న పరిస్థితిలో ఆదివారం విజయవాడలో పోలీసులకు చిక్కారు. రాజీవ్‌గాంధీ పార్కు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వద్ద నవజాత శిశువు ఉండటంతో అనుమానం వచ్చి విచారణ చేయగా అక్రమంగా కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఆ దంపతులతో పాటు, వారికి ఢిల్లీ నుంచి తోడుగా వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి మానవ అక్రమ రవాణా, శిశువు కొనుగోలు– అమ్మకం యాక్ట్‌లపై కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా పోలవరానికి చెందిన కొనతం వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులకు పిల్లలు లేక పోవడంతో అనేక ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య చికిత్సలు పొందారు. చివరికి ఢిల్లీలో ఉన్న ఓ ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడ ఇక పిల్లలు జన్మించరని నిర్ధారించారు. అదే ఆస్పత్రిలో పనిచేసే అమ్రిన్‌తో వారికి పరిచయం ఏర్పడింది. డబ్బులకు శిశువును విక్రయించేలా ఆమెతో దంపతులు మాట్లాడుకున్నారు. అమ్రీన్ సూచన మేరకు విడతల వారీగా రూ.6.59 లక్షలు ఆ దంపతులు చెల్లించారు. పాపను తీసుకోవడానికి రావాలని చెప్పడంతో వెంకట కృష్ణరెడ్డి, శివపార్వతి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమ్రీన్ ఒక ఆడ శిశువును వారికి ఇచ్చి, తోడుగా తన భర్త సయ్యద్ ఆలంను పంపించింది.
తనిఖీల్లో పట్టుబడింది ఇలా..
వెంకట కృష్ణారెడ్డి, శివపార్వతి దంపతులు నవజాత శిశువును తీసుకుని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న తరుణంలో రాజీవ్‌గాంధీ పార్క్ వద్ద మహిళా స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వాసవి తన సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తుండగా చిక్కారు. అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ కె.లతాకుమారి, సౌత్ ఏసీపీ మానసల సూచన మేరకు వారిని విచారణ చేయగా అక్రమంగా శిశువును కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఎక్కువ డబ్బులు సంపాదించాలని..
బిహార్‌లోని న్యూకరీమ్‌గంజ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆలం, అమ్రీన్ ఢిల్లీకి వలస వెళ్లారు. అక్కడ అమ్రీన్ ఓ ఐవీఎఫ్ సెంటర్‌లో పనిచేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పిల్లలు లేని వారిని కలిసి డబ్బులకు పిల్లలను విక్రయించాలనుకున్నారు. అలా శిశువును విక్రయించి పోలీసులకు చిక్కారు.
వారికి ఢిల్లీ నుంచి తోడుగా వచ్చిన
ఆలం అరెస్టు


